మేమంటే అన్ని జట్లకు భయం: పాక్ కెప్టెన్

ICC World Cup 2019, మేమంటే అన్ని జట్లకు భయం: పాక్ కెప్టెన్

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. దీంతో ఇరు జట్లకూ చెరో పాయింట్‌ లభించింది. ఈ సందర్భంగా పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ తమ జట్టుపై ఆడేందుకు అన్ని జట్లూ భయపడుతున్నాయని తెలిపాడు.

‘ఇంగ్లాండ్‌పై గెలిచాక మేం శ్రీలంకతో ఆడాల్సి ఉంది. టీం వర్క్‌తో ఈ మ్యాచ్‌ ఆడాలని ఎంతో అనుకున్నాం. అయితే వర్షం కారణంగా ఆడలేకపోయాం. నెక్ట్స్ మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో ఆడబోతున్నాం. మా జట్టుని చూసి అందరూ భయపడుతున్నారు. మిగతా జట్లలాగే ఆసిస్‌ కూడా బలమైన జట్టే. వాళ్లు రెండు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు’ అని సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు.

కాగా శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలుపొందితే సెమీస్‌ చేరేందుకు వారికి అవకాశాలు కాస్త మెరుగయ్యేవి. అయితే తన జట్టుని కచ్చితంగా సెమీస్‌కు తీసుకెళతానని సర్ఫరాజ్‌ ధీమా వ్యక్తంచేశాడు. తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని, ఇంగ్లాండ్‌తో గెలుపొందాక రెట్టింపైందని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *