రామ్ చరణ్
మెగస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా మెగా పవర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్లు కొడుతూ ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో చెర్రీ కూడా ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ, బిజినెస్ మెన్‌గానూ సత్తా చాటుతున్నాడు రామ్ చరణ్. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాలో వెండితెరకు పరిచయమయ్యాడీ మెగా పవర్ స్టార్. దుమ్మురేపే డ్యాన్స్‌లు, ఫైట్లతో మొదటి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్‌పేర్ పురస్కారం అందుకున్నాడు. ఇక రెండో చిత్రం మగధీరతో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాతో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ కొల్లగొట్టాడీ గ్లోబల్ స్టార్. అంతేకాదు ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. రచ్చతో మాస్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు. ఎవడు, నాయక్, ధ్రువ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్‌లోని నటనా ప్రతిభకు తార్కణంగా నిలిచింది. ఇందులో బుచ్చిబాబుగా చెర్రీ అభినయ విమర్శకులను సైతం మెప్పించింది. ఇదే సినిమాకు ఉత్తమ నటుడిగా మరోసారి ఫిల్మ్ పేర్ పురస్కారం అందుకున్నాడు రామ్ చరణ్. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను దున్నేశాడు. సీతారామరాజు పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మెగా పవర్ స్టార్ తన నటనతో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఇక నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ను స్థాపించి హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2012లో ఉపాసన కామినేనితో పెళ్లిపీటలెక్కారు. 2023లో ఈ దంపతులకు క్లింకార కొణిదెల అనే కూతురు జన్మించింది.