చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.