CM Chandrababu: సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే..?
శుక్రవారం అసెంబ్లీలో పేదలకు ఇళ్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు మాాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ఇళ్ల మంజూరు, ఉచితంగా స్థలాలు కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఇంటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇక స్థలాలు లేనివారికి స్థలాలను కూడా ఉచితంగా కేటాయిస్తామన్నారు.

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇళ్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా, పంపిణీ చేస్తారా అని నిరిక్షిస్తున్నారు. వారి నిరిక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త ఇళ్ల మంజూరు, నిర్మాణంపై అసెంబ్లీలో చంద్రబాబు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు పూర్తి చేయించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ప్రకటించారు. కొత్త ఇళ్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేపట్టామని స్పష్టం చేశారు.
2029 నాటికి పేదలకు స్థలాలు
శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ శాఖ పద్దులపై సీఎ చంద్రబాబు కీలక ప్రసంగం ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “గత వైసీసీ ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో పాల్పడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలు లేవు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా మా ప్రభుత్వంలో త్వరలో కేటాయిస్తాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నాం. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా దాదాపు 3 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయిస్తాం. జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు కూడా గృహప్రవేశాలు జరిపేలా చేస్తాం. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తాం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏఐ సేవలు
“ఇక రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం 2026-27 బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశాం. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు 3 విడతల్లో రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. గత ప్రభుత్వం కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు కేంద్రం వాటా రూ.6 వేలతో కలుపుకుని రూ.20 వేలు మా ప్రభుత్వం ఇస్తోంది. 47 లక్షల మంది రైతులకు 2 విడతల్లో రూ.6,309 కోట్లు రైతులకు అందించాం. రూ.310 కోట్లు పంట నష్టం సొమ్మును చెల్లించాం” అని చంద్రబాబు తెలిపారు.
