ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుంది. అక్కడ అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే 88 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎం అయ్యారు. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.95 శాతం ఓట్లు పోల్ కాగా.. టీడీపీకి 39.17శాతం, జనసేన పార్టీకి 5.53 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. నాటి ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు, టీడీపీ 23 స్థానాలు, జనసేన 1 స్థానంలో విజయం సాధించింది.

2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ(టీడీపీ), జనసేన పార్టీ, బీజేపీలు కలిసి వైసీపీతో తలపడుతున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ 144 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అటు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ కూడా పోటీ చేస్తున్నాయి.

2024 ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.