ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
రాష్ట్ర అసెంబ్లీలోని 175 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు త్వరలోనే జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీకాలం 2024 జూన్ 11వ తేదీతో ముగియనుంది. 2019లో ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. 79.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 151 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యింది. నాటి ఎన్నికల్లో జనసేన ఒక సీటును గెలుచుకోగా.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాటి ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాయి. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఆ ఎన్నిక్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.95 శాతం ఓటింగ్ నమోదుకాగా.. టీడీపీకి 39.17 శాతం, జనసేన పార్టీకి 5.53 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు ధివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 88గా ఉంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు జమిలి ఎన్నికలు జరగనున్నాయి.