ఉగాది
ఉగాది అంటే సృష్టి ప్రారంభం అయిన రోజు.. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున జరుపుకునే పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఈ ఏడాది తెలుగు కొత్త సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ వచ్చింది. మంగళవారం రోజున శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.
యుగాది అనే పదం రెండు పదాల కలయిక – ” యుగం ” (వయస్సు) ” ఆది ” (ప్రారంభం) అని అర్ధం. హిందూ చాంద్రమాన క్యాలెండర్ లేదా పంచాంగ ప్రకారం ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక, గోవా ల్లో ఘనంగా జరుపుకుంటారు. ఉగాదినే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో గుడి పడ్వా పండగగా జరుపుకుంటారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరిచి, ముగ్గులతో అలంకరించి తెలుగు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం. ప్రజలు కొత్త బట్టలు ధరించి ఆలయానికి వెళ్తారు. ఆలయంలో పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని విని తమ భవిష్యత్ ను తెలుసుకుంటారు.