PM Kisan: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. హోలీకి ముందే అకౌంట్లోకి డబ్బులు
పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త. నగదు జమ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. హోలీకి ముందే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సాయం జమ కానున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు రైతుల అకౌంట్లలో రూ.2 వేలు పడనున్నాయి. ఈ నగదు పడాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.

పీఎం కిసాన్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మరో 10 రోజుల్లో పీఎం కిసాన్ నిధులను జమ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు రైతుల అకౌంట్లో 22వ విడతలో భాగంగా రూ.2 వేలు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ నగదును స్వయంగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మార్చి 3వ తేదీన హోలీ పండుగ వస్తోంది. దీంతో హోలీ పండుగ కానుకగా పీఎం కిసాన్ విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం. హోలీకి ముందే రైతుల అకౌంట్లో ఇవి జమ అవుతాయని తెలుస్తోంది. రైతులు ఎప్పటినుంచి వీటి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. హోలీకి ముందే పడే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పీఎం కిసాన్ పడాలంటే..?
పీఎం కిసాన్ నగదు లబ్దిదారుల అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. లేకపోతే నగదును నిలిపివేస్తారు. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత నగదు ఆటోమేటిక్‌గా అకౌంట్లో జమ అవుతాయి. ఈకేవైసీ పూర్తి చేసేందుకు రైతులు సమీపంలో సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మీరు స్వయంగా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
మీకు డబ్బులు పడకపోతే..
ఒకవేళ పీఎం కిసాన్ నగదు జమ చేసిన తర్వాత మీ అకౌంట్లో పడకపోతే మీ మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి. ఇక పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ లోకి వెళ్లి కారణం తెలుసుకోండి. సమస్య తెలుసుకుని పరిష్కరించుకోవడం ద్వారా మీరు పీఎం కిసాన్ పొందవచ్చు.
