భారత స్వాతంత్య్ర దినోత్సవం
భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల వందల ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్య్రం పొందింది. అందుకే దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వాతంత్ర భారతావని పలు రంగాల్లో సాధించిన పురోగతిని స్మరించుకుంటోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జాతీయ సెలవు దినంగా ఉంది. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని.. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో స్వాతంత్య్ర పోరాట వీరులను భరతమాత కోల్పోయింది. పోరాటాల ఫలితంగా ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.
జూన్ 3, 1947న బ్రిటీష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం ప్రసాదించే ప్రస్తావన ఉన్న ఒక ప్రణాళికను సమర్పించారు. దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఆయన ప్రణాళికలో బ్రిటిష్ పాలన నుంచి ఇండియాను విడుదల చేయడం, భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలను ఏర్పాటు చేయడం, రెండు దేశాల ప్రభుత్వాలకు స్వయంప్రతిపత్తి, సార్వభౌమాధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. భారతదేశంలోని రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరే హక్కు ఉంటుందని ఆయన ప్రణాళికలో పేర్కొనబడింది.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు మౌంట్ బాటన్ 4 జూలై 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత స్వాతంత్య్ర బిల్లును సమర్పించారు. ఈ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం ప్రకటించబడింది. అదే రోజున దేశ తొలి ప్రదాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం కొనసాగుతోంది.