AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scrub Typhus: ప్రజలను భయపెడుతున్న స్క్రబ్ టైఫస్.. లక్షణాలు, నివారణ చర్యలు!

ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసుల పెరుగుదల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక చిన్న కీటకం ద్వారా వ్యాపించే ఈ ఇన్‌ఫెక్షన్ సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ..

Scrub Typhus: ప్రజలను భయపెడుతున్న స్క్రబ్ టైఫస్.. లక్షణాలు, నివారణ చర్యలు!
Scrub Typhus
Nikhil
|

Updated on: Dec 05, 2025 | 8:44 AM

Share

ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసుల పెరుగుదల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక చిన్న కీటకం ద్వారా వ్యాపించే ఈ ఇన్‌ఫెక్షన్ సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.

స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియంటియా సూసుగముషి’ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా పొదలు, పచ్చిక బయళ్లలో ఉండే నల్లులు అనే చిన్న కీటకాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ నల్లి మనకు తెలియకుండానే కుట్టి, జారిపోతుంది. ఈ వ్యాధి మనుషుల నుండి మనుషులకు నేరుగా వ్యాపించదు. కేవలం నల్లి కుట్టినప్పుడు మాత్రమే సోకుతుంది. నల్లి కుట్టిన చోట మొదట్లో ఒక చిన్న నల్లటి మచ్చ లేదా దద్దురులా కనిపిస్తుంది.

లక్షణాలు:

  1.  తీవ్రమైన జ్వరం.
  2.  నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఏర్పడటం.
  3.  తలనొప్పి, ఒంటి నొప్పులు.
  4.  వాంతులు, పొడి దగ్గు.
  5.  తీవ్రమైన నీరసం.

స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే, ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, చికిత్స ఆలస్యమైతే మరణాల రేటు 30% వరకు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల కిడ్నీ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు, కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, సకాలంలో.. అంటే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే, ప్రమాదం 2% వరకు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వ్యాధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో పనిచేసేవారు, పశువులను చూసుకునేవారు, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, పొదలు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారిలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

  •  పచ్చిక లేదా పొదల్లో తిరిగేటప్పుడు తప్పనిసరిగా పొడవైన దుస్తులు ధరించాలి.
  •  ఇంటి చుట్టుపక్కల చెత్త, పొదలను వెంటనే శుభ్రం చేయాలి. నల్లులు పెరిగే వాతావరణాన్ని నివారించాలి.
  •  ఒంటిపై ఎక్కడైనా నల్లి కుట్టినట్లు అనుమానం ఉన్నా, లేదా నల్లటి మచ్చ, దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

    NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.