AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిఫిన్ అక్కర్లేదు.. 5 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు

రాగి జావ చిరుధాన్యాల్లో ఒకటి. ఇది కాల్షియం, ఐరన్, పీచుపదార్థాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం. ఫెర్మెంటెడ్ రాగి జావ జీర్ణవ్యవస్థకు, బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. పిల్లలకు మెదడు అభివృద్ధి, ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది ముఖ్యంగా అల్పాహారంగా తీసుకోవడానికి అనువైనది. సమయం లేనివారు లేదా మార్పు కోరుకునే వారికి రాగి జావ ఒక మంచి ప్రత్యామ్నాయం.

టిఫిన్ అక్కర్లేదు.. 5 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు
Ragi Malt
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2026 | 11:06 AM

Share

రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. రాగి జావ మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడానికి ఎంతో ఆరోగ్యకరమైన ఎంపిక అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. వాస్తవానికి రాగులు చిరుధాన్యాల కోవకు చెందినవి.. రాగి జావ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. రాగి జావలో కాల్షియం, ఐరన్, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం అల్పాహారంగా రాగి జావ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇడ్లీ, దోశ వంటి సంప్రదాయ అల్పాహారాలకు సమయం లేని వారికి లేదా తేలికపాటి ఆహారాన్ని ఇష్టపడే వారికి రాగి జావ ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

మధుమేహులు రాగి జావ తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రాగి జావ గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉండటం వలన, కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, మధుమేహులు రాగి జావను నివారించడం లేదా తప్పనిసరిగా తీసుకోవాలని భావిస్తే, పరిమిత మోతాదులో తీసుకుంటూ చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం మంచిది.

రాగి జావను ఇలా తీసుకోండి..

రాగి జావను వివిధ రకాలుగా తయారుచేసుకోవచ్చు. దీనిని పాలు, మజ్జిగ లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. అయితే, ఫెర్మెంటెడ్ రాగి జావ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఫెర్మెంటెడ్ రాగి జావ అంటే, ముందు రోజు రాగి పిండిని పులియబెట్టి, దానిని మరుసటి రోజు ఉదయం పెరుగు లేదా మజ్జిగతో కలిపి తీసుకోవడం. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇది మంచి ప్రీబయోటిక్‌గా పనిచేసి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ బాగుంటుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది తేలికపాటి, పోషకమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట భారీగా కాకుండా తేలికగా, సౌకర్యవంతంగా ఉండాలనుకునే వారికి రాగి జావ ఒక అద్భుతమైన ఎంపిక..

చిన్నపిల్లలకు రాగి జావను మంచి స్నాక్‌గా ఇవ్వవచ్చు. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత లేదా ఆకలిగా ఉన్నప్పుడు, రాగి జావలో కొద్దిగా బెల్లం, ఒక స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి ఇవ్వడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆవు నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి పిల్లల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. అంతేకాకుండా, చిన్నపిల్లలకు ఎముకల పెరుగుదలకు అవసరమైన కాల్షియం రాగి జావ ద్వారా లభిస్తుంది. టీనేజర్లలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే, రాగి జావ తీసుకోవడం వల్ల అవి మెరుగుపడతాయి. ఎముకల అభివృద్ధికి కూడా ఇది సహాయపడుతుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి రాగి జావలోని పీచుపదార్థాలు ఎంతో ఉపకరిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల, రాగి జావను రోజూ లేదా కనీసం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు అయినా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ప్రకృతిసిద్ధంగా లభించే, మన శరీరానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఆరోగ్యకరమైన జీవితం కోసం రాగి జావను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.

నిమిషాల్లోనే సులభంగా రాగి జావ..

రాగి జావను నిమిషాల్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.. నీటిలో కొంచెం రాగి పిండి వేసి కలుపుకోని.. వేడి నీటిలో దానిని వేయాలి.. రుచికి తగ్గట్లు ఉప్పును కలుపుకోవచ్చు.. రాగి జావతోపాటు.. రాగులతో ఇడ్లీ, దోశ వంటివి కూడా చేసుకోని తినవచ్చు.. ఎండాకాలంలో రాగి జావను తీసుకుంటే.. కడుపు చల్లగా ఉంటుంది.. అందుకే.. ఏవి పడితే అవి తినకుండా.. ఇప్పటినుంచే రాగులను, రాగి పిండిని మీ ఆహారంలో భాగం చేసుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us