మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.
మహేష్ బాబు సినిమాలతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 1200 మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి కుటుంబంలో వెలుగులు నింపాడు. మహేష్ బాబును టాలీవుడ్ అందగాడు అని పిలుస్తూ ఉంటారు. చూడటాన్ని హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న జన్మించారు. ఈయన ప్రఖ్యాత నటుడు కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు.