వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.
కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.