Andhra Politics: ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్.. జగన్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి నిమ్మల కౌంటర్..
ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది. కర్నాటక నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదా? ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా అడ్డుకోరా? అని జగన్ ప్రశ్నిస్తోంటే.. వట్టి మాటలు కట్టి పెట్టు అంటూ కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం.. దీంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి..

కృష్ణానదిపై కర్నాటకలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే ప్రయత్నాల్లో ఉంది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారు. ఏపీ హక్కులు కాపాడలేని చంద్రబాబుకు సీఎం పదవి ఎందుకని సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రశ్నించారు. గతంలోనూ కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో టీడీపీకి ఉన్న బలాన్ని ఉపయోగించి.. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్ మాటలు -నిమ్మల
జగన్ చేసిన ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్.. ఇప్పుడు నీళ్ల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు మంత్రి నిమ్మల.. జగన్ అసలు రూపాన్ని, అంతర్గతంగా ఉన్న అరాచక శక్తిని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే తిప్పి కొట్టారన్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రాజెక్ట్‌ల గురించి జగన్ పట్టించుకోలేదంటూ మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా.. దీనిపై హీట్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.. ఇలా.. మొత్తంగా.. ప్రాజెక్ట్‌ల విషయంలో ఏపీలో పొలిటికల్ వరద పారుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
