టీడీపీ
తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.
1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.