Andhra Pradesh: బీఅలర్ట్.. వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ విరుచుకుపడుతోంది. వైసీపీ విమర్శలతో టీడీపీ అధిష్ఠానం అలర్ట్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ విరుచుకుపడుతోంది. వైసీపీ విమర్శలతో టీడీపీ అధిష్ఠానం అలర్ట్ అయింది. వైసీపీ వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు భావోద్వేగంతో స్పందిస్తుండటంతో పార్టీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు, వెంటనే అప్రమత్తమయ్యారు. టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
అధికారం కోల్పోయామనే అసహనంతో ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కుట్రలకు తెరలేపారన్నారు చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, సీనియర్ నేతలు బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు.. రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులను సాధించి అభివృద్ధి చేయాలన్నదే టీడీపీ ప్రధాన అజెండా అని సీఎం చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. దీనిని చెడగొట్టేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు. తప్పు చేసిన ప్రతీ ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ ట్రాప్‌లో పడొద్దని సూచించారు.
ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు కీలక సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఎవరూ కూడా భావోద్వేగాలకు లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రతి చర్య పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని ఆయన దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తరుణంలో, ఈ ప్రధాన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రత్యర్థి పార్టీలు కుట్ర పన్నుతున్నాయని పల్లా ఆరోపించారు. ప్రభుత్వ గౌరవానికి భంగం కలగకుండా బాధ్యతాయుతంగా ఉండాలని పార్టీ కేడర్‌కు ఆయన హితబోధ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
