NATO సదస్సులో ట్రంప్ ఎక్కడ బస చేస్తున్నారో ఇరాన్‌కు ముందే తెలుసా? ఆయన ఉన్న ఫ్లోర్ కూడా తెలుసని రిపోర్ట్!
Trump Security Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీలో పర్యటించిన సమయంలో రహస్యంగా విమానం మార్చిన ఘటన వెనుక తీవ్ర భద్రతా ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికతోనే ఈ అసాధారణ ఆపరేషన్ చేపట్టినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

Trump Security Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టర్కీలో పర్యటించిన సమయంలో చోటుచేసుకున్న అనూహ్య విమాన మార్పు వెనుక తీవ్ర భద్రతా ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ను తీసుకెళ్తున్న విమానంపై ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందన్న విశ్వసనీయ నిఘా సమాచారం అందడంతోనే ఈ రహస్య ఆపరేషన్ చేపట్టినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. నాటో సదస్సు చివరి రోజైన జూలై 8న ట్రంప్ అంకారా నుంచి టర్కీని విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ముప్పు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అమెరికా నిఘా సంస్థలకు పలు మార్గాల ద్వారా సమాచారం అందిందని, అందులో ఎయిర్ ఫోర్స్ వన్‌పై ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో దాడి చేసే అవకాశం ఉందన్న నిర్దిష్ట హెచ్చరిక కూడా ఉన్నట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది.
సమ్మిట్ వద్ద క్షిపణితో వ్యక్తి?
ఈ వ్యవహారంలో మరో ఆందోళనకర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. నాటో సదస్సు జరిగే ప్రాంతానికి సమీపంలో భుజంపై మోసుకెళ్లే క్షిపణి (Shoulder-fired missile)తో ఓ వ్యక్తి కనిపించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఇరాన్‌కు చెందిన ఆపరేటివ్‌లకు అంకారాలో ట్రంప్ బస చేస్తున్న ప్రదేశం గురించి స్పష్టమైన సమాచారం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ఏ భవనంలో, ఏ అంతస్తులో ఉన్నారన్న సమాచారం కూడా వారికి తెలిసి ఉండవచ్చని అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ హెచ్చరికలను అమెరికా అధికారులు తీవ్రంగా పరిగణించడంతో ట్రంప్‌ను టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లేందుకు అత్యంత రహస్యమైన భద్రతా ఆపరేషన్‌ను అమలు చేసినట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కినట్టే కనిపించిన ట్రంప్
టర్కీ నుంచి బయలుదేరేటప్పుడు పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణిస్తానని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అసలు ప్రణాళిక పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కెమెరాల ముందే ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి ఎక్కారు. దీంతో ఆయన అదే విమానంలో టర్కీ నుంచి బయలుదేరుతున్నారనే అభిప్రాయం అందరికీ కలిగింది. కానీ అది కేవలం ఒక డీకాయ్ ఆపరేషన్‌లో భాగమేనని సమాచారం.
వైట్ హౌస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది, అధ్యక్షుడితో ప్రయాణించే మీడియా ప్రతినిధులతో కూడిన బృందాన్ని ఆ విమానంలోనే పంపించారు. అనంతరం ట్రంప్‌ను విమానాశ్రయంలోని క్యాటరింగ్ కంటైనర్ ద్వారా రహస్యంగా మరో ప్రాంతానికి తరలించినట్లు నివేదిక వెల్లడించింది. అక్కడి నుంచి ఆయనను చిన్న సైనిక విమానంలోకి మార్చి టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
జర్నలిస్టులు కూడా తెలియకుండానే ‘డీకాయ్’గా..
ఈ ఆపరేషన్‌లో ట్రంప్‌తో పాటు ప్రయాణించే జర్నలిస్టులు కూడా తెలియకుండానే డీకాయ్‌గా మారారు. తమను భద్రతా ఆపరేషన్‌లో భాగంగా ఉపయోగించారని తెలిసిన తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భద్రతా ముప్పు గురించి తమకు ముందుగానే సమాచారం ఇవ్వకుండా వైట్ హౌస్ తమను ఈ ఆపరేషన్‌లో భాగం చేసిందని వారు విమర్శించినట్లు నివేదిక పేర్కొంది.
ఖతార్ ఇచ్చిన విలాసవంతమైన విమానం..
ట్రంప్ టర్కీకి ఖతార్ బహుమతిగా ఇచ్చిన అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747లో చేరుకున్నారు. భవిష్యత్తులో దీనిని అధ్యక్ష విమానంగా ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న స్థాయిలో క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు లేవని నివేదిక పేర్కొంది. దీంతో ట్రంప్‌ను టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లేందుకు పాత ఎయిర్ ఫోర్స్ వన్‌ను ఉపయోగించాలన్న నిర్ణయం తీసుకోవడంలో ఈ అంశం కూడా కీలకంగా మారినట్లు తెలుస్తోంది. విమాన మార్పు కారణంగా ట్రంప్ సాధారణంగా తనతో పాటు ప్రయాణించే సీనియర్ వైట్ హౌస్ అధికారులు, భద్రతా సిబ్బంది, జర్నలిస్టుల నుంచి కూడా తాత్కాలికంగా వేరుగా వెళ్లాల్సి వచ్చింది.
‘నాకు పెద్దగా తెలియదు’ అన్న ట్రంప్
అయితే ఈ తీవ్రమైన భద్రతా ముప్పుపై ట్రంప్ మాత్రం పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు. మంగళవారం ఒహాయోలో జరిగిన కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ వ్యవహారంపై విలేకరులు ప్రశ్నించగా, తనను మరో విమానంలో పంపించాలని సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు నిర్ణయించారని చెప్పారు.
“వాళ్లు నన్ను వేరే ఫ్లైట్‌లో, వేరే విమానంలో వెళ్లాలని కోరుకున్నారు. అక్కడ ఏదో ముప్పు ఉందని అనుకుంటున్నాను. దాని గురించి నేను పెద్దగా అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని ట్రంప్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. అయితే, ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం నిఘా సంస్థలు ఎంతటి అసాధారణ చర్యలకు సిద్ధమవుతాయో మరోసారి స్పష్టమైంది. అయితే ట్రంప్‌పై క్షిపణి దాడికి సంబంధించిన నిఘా సమాచారంలోని పూర్తి వివరాలు ఇప్పటికీ బహిరంగంగా వెల్లడించలేదు.
