జాతీయ అవార్డు గ్రహీత, నటి కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వదంతులపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. పరిశ్రమలో పలువురు హీరోలతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు తనను ఎంతగానో బాధపెట్టాయని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, తన జీవితంలో ఇప్పటివరకు ప్రేమించింది ఒకరినే అని, ఆయనే తన భర్త ఆంటోనీ అని కీర్తి సురేష్ స్పష్టతనిచ్చారు. 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంట, దాదాపు 15 ఏళ్లుగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించింది. మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది జాతీయ అవార్డు అందుకున్న తర్వాత, తనకు ఆరు నెలల పాటు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదని కీర్తి వెల్లడించారు. ఈ కష్టకాలంతో పాటు, తన వ్యక్తిగత జీవితంపై కూడా అవాస్తవ పుకార్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వదంతుల గురించి తన భర్త ఆంటోనీ కూడా అప్పుడప్పుడూ తనను ప్రశ్నించేవారని, వాటిపై స్పందించారా అని అడిగేవారని కీర్తి సురేష్ పేర్కొన్నారు. అయితే, “మా ఇద్దరి మధ్య నమ్మకం ఉన్నప్పుడు బయటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని నేను అనుకునేదాన్ని” అని కీర్తి వివరించారు. ఎన్ని రూమర్స్ వచ్చినా, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమ ప్రేమకు అసలైన బలమని ఆమె మాటల్లోనే అర్థమవుతోంది. వారి 15 ఏళ్ల ప్రేమబంధం, పెళ్లి తర్వాత కూడా చెక్కుచెదరని నమ్మకంతో దృఢంగా నిలిచిందని కీర్తి సురేష్ స్పష్టం చేశారు.