Hardik Pandya: ప్రపంచ ఛాంపియన్ అయితే.. ఇలా చేస్తావా.. హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు.. ఎందుకంటే?
Hardik Pandya National Flag Complaint: టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం జరిగిన సంబరాల్లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై వివాదం చెలరేగింది. జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ పుణే పోలీసులకు ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Hardik Pandya controversy: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో పుణే పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. పుణేలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్ వజీద్ ఖాన్ ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం భారత జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాతీయ జెండా చుట్టుకొని అనుచిత ప్రవర్తన..?
ఫిర్యాదు ప్రకారం హార్దిక్ పాండ్యా జాతీయ త్రివర్ణ పతాకాన్ని తన శరీరానికి చుట్టుకొని మైదానంలో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ చర్య భారత జాతీయ జెండా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ పౌరులందరికీ జాతీయ పతాక గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.
వరల్డ్ కప్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన..
ఇక క్రికెట్ పరంగా చూస్తే టీ20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్ మొత్తం మీద ఆయన తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు అర్ధశతకాలు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా నమీబియాపై జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించారు.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో చోటు..
పాండ్యా ప్రదర్శనను గుర్తించిన ఐసీసీ అతన్ని 2026 టీ20 వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో చోటు కల్పించింది. ఇది అతని ఆల్‌రౌండ్ ప్రతిభకు మరో గుర్తింపుగా భావిస్తున్నారు.
భారత జట్టు చారిత్రక విజయం..
అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక మొత్తంగా మూడు సార్లు ఈ టైటిల్‌ను గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్, ఇప్పుడు మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



