భారత క్రికెట్ జట్టు
క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్‌ను క్రికెట్ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్‌లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్‌ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్‌లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.