AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Gavaskar : గవాస్కర్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. సోషల్ మీడియాలో నెటిజన్ల రివర్స్ అటాక్

Sunil Gavaskar : పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ యజమానులు ద హండ్రెడ్ లీగ్ కోసం కొనడాన్ని సునీల్ గవాస్కర్ విమర్శించారు. దీనిపై ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫీక్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. సునీల్ గవాస్కర్ తన తాజా కాలమ్‌లో ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

Sunil Gavaskar : గవాస్కర్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. సోషల్ మీడియాలో నెటిజన్ల రివర్స్ అటాక్
Sunil Gavaskar
Rakesh
|

Updated on: Mar 18, 2026 | 9:37 AM

Share

Sunil Gavaskar : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త వివాదం చెలరేగింది. ఇది ఆట గురించి మాత్రమే కాదు, దేశభక్తి, నైతికతకు సంబంధించిన అంశంగా మారింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు యజమానిగా ఉన్న సన్ గ్రూప్, బ్రిటన్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ అనే జట్టును కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన వేలంలో, ఈ జట్టు పాకిస్థానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.35 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ కూడా స్వయంగా పాల్గొన్నారు. అయితే, భారతీయ యజమానులు పాక్ ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించడాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు.

సునీల్ గవాస్కర్ తన తాజా కాలమ్‌లో ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. “భారతీయ యజమానులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలి. పాకిస్థాన్ ఆటగాళ్లను కొనడం మానుకోవాలి. ఈ టోర్నమెంట్‌ను గెలవడం మన భారతీయ సైనికుల, పౌరుల ప్రాణాల కంటే అంత ముఖ్యమా?” అని ఆయన ప్రశ్నించారు. మనం పాక్ ప్లేయర్లకు ఇచ్చే డబ్బు, పరోక్షంగా భారత సరిహద్దుల్లో ఉగ్రవాదానికి, మన సైనికుల మరణాలకు కారణమయ్యే వ్యవస్థకు చేరుతుందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యాపార లాభాలు ముఖ్యం కాకూడదని ఆయన ఐపీఎల్ యజమానులకు గట్టి సందేశం ఇచ్చారు.

గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మూలాలున్న ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫీక్ వివాదాస్పదంగా స్పందించారు. ఎక్స్ వేదికగా గవాస్కర్‌ను టార్గెట్ చేస్తూ.. “గవాస్కర్ ఎన్ని పరుగులు చేశారనేది నాకు అనవసరం, ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి, వీటిని ఖండించాలి” అని రాశారు. అంతేకాకుండా, “గవాస్కర్ ఎప్పుడైనా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లకు కామెంటరీని బహిష్కరించారా? నాకు తెలిసి అలా చేయలేదు” అంటూ ఎద్దేవా చేశారు. గవాస్కర్ దేశభక్తిని ప్రశ్నిస్తూ రఫీక్ చేసిన ఈ పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

అయితే అజీమ్ రఫీక్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవాస్కర్‌ను విమర్శించిన రఫీక్‌ను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. “గవాస్కర్ పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు, ఆయన చేసేది వృత్తి. కానీ భారతీయ యజమానులు పాక్ ప్లేయర్లకు నేరుగా కోట్ల రూపాయలు ఇవ్వడం వేరు” అని నెటిజన్లు సమాధానం ఇస్తున్నారు. మరికొందరు.. “పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వీడే వరకు సాధారణ సంబంధాలు ఆశించవద్దు, ఇతరుల గుర్తింపు కోసం రఫీక్ పాకులాడటం మానేయాలి” అని చురకలు అంటిస్తున్నారు. మొత్తం మీద కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us