08 July 2026

శాంసన్‌పై వేటుకు అసలు కారణం ఇదే.. గౌతమ్ గంభీర్ క్లారిటీ..!

Venkata Chari

ప్రపంచకప్ విజేత, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను వరుస మ్యాచ్‌ల్లో పక్కన పెట్టడంపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనికి జరిగిన అన్యాయంపై మాజీ దిగ్గజాలు సైతం పెదవి విరుస్తున్న తరుణంలో, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు నోరు విప్పారు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ గంభీర్ సంజూ శాంసన్ వివాదంపై మాట్లాడారు. సంజూ శాంసన్ భారత్ తరఫున ఇప్పటివరకు చేసిన ప్రదర్శన అద్భుతమని, దానిపై తమకు ఎలాంటి సందేహాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడం వల్లే అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందని కోచ్ సమర్థించుకున్నారు.

తుది జట్టుతో పాటు రాబోయే జింబాబ్వే పర్యటన నుంచి కూడా సంజూ శాంసన్‌ను తొలగించడంపై అభిమానులు యాజమాన్యం తీరును తప్పుబడుతున్నారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి సంజూకు ముందే చెప్పారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

దీనిపై గంభీర్ స్పందిస్తూ.. "ఒక ఆటగాడిగా సంజూకు ఎలాంటి స్పష్టత కావాలో, దానిని నేను వ్యక్తిగతంగా అతనికి వివరించాను. అయితే ఒక ప్రధాన కోచ్‌గా నాకు, ఆటగాడికి మధ్య జరిగిన ఆ అంతర్గత సంభాషణను నేను బయటకు వెల్లడించలేను. అది మా ఇద్దరి మధ్యే ఉంటుంది" అని తేల్చి చెప్పారు. 

కాగా, ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో సంజూ తిరిగి రాడనే నియమం ఏమీ లేదని కూడా గంభీర్ పేర్కొనడం గమనార్హం. ఐర్లాండ్ పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్, ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత అకస్మాత్తుగా జట్టుకు దూరమయ్యాడు. 

మ్యాంచెస్టర్, నాటింగ్‌హామ్ వేదికలుగా జరిగిన మ్యాచ్‌ల్లో సంజూ స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. సూర్యవంశీ అరంగేట్రం చేయాలని అందరూ కోరుకున్నప్పటికీ, అందుకోసం ఫామ్‌లో ఉన్న సంజూను బలిపశువును చేయడం ఎవరికీ నచ్చలేదు. 

భారత జట్టు మాజీ ఆటగాళ్లు అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు సైతం సంజూకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమేనని బహిరంగంగానే మద్దతు పలికారు. ఒకప్పుడు సంజూ ప్రతిభను ఎంతగానో అభినందించిన గంభీర్, ఇప్పుడు కోచ్ బాధ్యతలు చేపట్టాక అదే ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం. 

కేవలం మూడు ఇన్నింగ్స్‌ల ఆధారంగా ఒక అద్భుతమైన ఆటగాడిని జట్టుకు దూరం చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ ఇంకా సాగుతూనే ఉంది. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా సంజూకు అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి.