టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మరోసారి దూరమైన తోపు ప్లేయర్..?

September 27 2026

venkata chari

భారత క్రికెట్ జట్టు (Team India) ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి గాయంతో పోటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. అతడి కుడి కాలి షిన్‌ బోన్‌లో ఒత్తిడి కారణంగా సమస్య ఏర్పడినట్లు సమాచారం. 

వైద్య పరీక్షల్లో ఎలాంటి ఫ్రాక్చర్‌ లేదని, ఎముకకు నిర్మాణపరమైన నష్టం కూడా కనిపించలేదని తెలుస్తోంది. దీనిని ‘ఎస్టాబ్లిష్డ్‌ స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌’గా పరిగణించలేదని సమాచారం. ప్రస్తుతం రెండు వారాల విశ్రాంతిని వైద్య బృందం సూచించింది. 

ఇలాంటి గాయాలు సాధారణంగా పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఆస్ట్రేలియా ‘A’తో జరిగే వన్డే సిరీస్‌కు పాండ్యా అందుబాటులో ఉండడు. 

అక్టోబర్‌ 6, 9, 11 తేదీల్లో పుదుచ్చేరిలో జరగాల్సిన మూడు 50 ఓవర్ల మ్యాచ్‌ల కోసం అతడిని షరతులతో ఎంపిక చేశారు. ఇప్పుడు ఆ ప్రణాళికకు గాయం అడ్డంకిగా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) తరువాత పాండ్యా పోటీ క్రికెట్‌ ఆడలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు ఆ తరువాత మైదానానికి దూరంగా ఉన్నాడు.

అతడి చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ మార్చిలో అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌. వన్డేల్లో చివరి మ్యాచ్‌ 2025 మార్చిలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ కావడం గమనార్హం. ప్రస్తుతం తిరిగి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం పాండ్యాకు ప్రధాన అంశంగా మారింది.

వచ్చే నెలలో భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 1 వరకు టీ20లు, నవంబర్‌ 4 నుంచి 15 వరకు వన్డేలు జరగనున్నాయి. ఈ పర్యటనలో పాండ్యా పాల్గొనడంపై ఇప్పటికైతే స్పష్టత లేదు.

పాండ్యా త్వరగా మైదానంలోకి రావాలని ఆసక్తిగా ఉన్నట్లు అతడికి సన్నిహిత వర్గాల సమాచారం. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అతడి ప్రాధాన్యాన్ని భారత కోచ్‌ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గతంలో వివరించాడు. 

ఐపీఎల్‌ తరువాత పాండ్యా ఎక్కువ క్రికెట్‌ ఆడకపోవడంతో.. ముందుగా టీ20లు ఆడి, ఆపై వన్డేలకు రావడం ఉపయోగపడొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు పాండ్యా పునరాగమనానికి గాయం పరిస్థితి కీలకంగా మారింది.