AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపాలను తొగించే.. పాపమోచని ఏకాదశి ఎప్పుడు..? ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!

Papmochani Ekadashi 2026: హిందూ పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి మార్చి 14, 2026 ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై.. మార్చి 15, 2026 ఉదయం 9:16 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నియమం ప్రకారం పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 15, 2026 (ఆదివారం) నాడు ఆచరిస్తారు. ఉపవాసాన్ని మార్చి 16న ద్వాదశి తిథి రోజున విరమించాలి.

పాపాలను తొగించే.. పాపమోచని ఏకాదశి ఎప్పుడు..? ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!
Papmochani Ekadashi 2026
Rajashekher G
|

Updated on: Mar 12, 2026 | 11:18 AM

Share

Papmochani Ekadashi Significance: హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మార్చి నెలలో వచ్చే పాపవిమోచని ఏకాదశికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. “పాపమోచని” అనే పదం రెండు పదాల కలయిక.. పాపం, మోచని. అంటే పాపాల నుంచి విముక్తి కలిగించేది. ఈ ఏకాదశి ఉపవాసం కేవలం ఆచారం మాత్రమే కాకుండా, మనస్సు, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర సాధనంగా భావించబడుతుంది. ఈ రోజున భక్తులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజించి, తులసి ఆకులు సమర్పించి, దీపం వెలిగించి, మంత్రజపం చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఇలా భక్తితో ఆరాధించిన వారికి జీవితంలోని కష్టాలు తగ్గి, పాపబాధలు తొలగుతాయని నమ్మకం. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, ధర్మం పెరుగుతాయి. ఈ రోజున చేసే జపం, తపస్సు, దానధర్మాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

పాప విమోచని ఏకాదశి తిథి వివరాలు (2026)

హిందూ పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి మార్చి 14, 2026 ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై.. మార్చి 15, 2026 ఉదయం 9:16 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నియమం ప్రకారం పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 15, 2026 (ఆదివారం) నాడు ఆచరిస్తారు. ఉపవాసాన్ని మార్చి 16న ద్వాదశి తిథి రోజున విరమించాలి.

పాప విమోచని ఏకాదశి పౌరాణిక కథ

పురాణాలలో చెప్పబడిన కథ ప్రకారం.. చ్యవన మహర్షి కుమారుడు మేధవి ఋషి.. తీవ్రమైన తపస్సులో నిమగ్నమయ్యాడు. అతని తపస్సు ప్రభావంతో దేవలోకం కలవరపడింది. అతని ధ్యానాన్ని భంగపరచడానికి దేవేంద్రుడు.. అప్సరస మంజుఘోషను పంపించాడు. ఆమె సౌందర్యం, ప్రలోభాలకు లోనై, మేధవి ఋషి తన తపస్సును కోల్పోయి చాలా కాలం ప్రాపంచిక జీవనంలో గడిపాడు.

తరువాత తన తప్పును గ్రహించి తీవ్ర పశ్చాత్తాపంతో బాధపడుతూ, పాప విమోచనం కోసం మార్గాన్ని వెతికాడు. ఆ సమయంలో దేవర్షి నారదుడు అతనికి పాపమోచని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలని సూచించాడు. ఆ ఉపవాసాన్ని శ్రద్ధతో పాటించి శ్రీనారాయణుడిని పూజించడంతో, మేధవి ఋషి తన ఆధ్యాత్మిక శక్తులను తిరిగి పొందాడు. తన పాపాల నుండి విముక్తి పొందాడు.

పాపమోచని ఏకాదశి ఉపవాస విధానం

  • ఉపవాస సంకల్పాన్ని దశమి రోజు రాత్రి తీసుకోవాలి.
  • బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
  • ఇంటి పూజా స్థలాన్ని శుభ్రపరిచి శ్రీమహావిష్ణువు చిత్రము లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
  • దీపం, ధూపం, పువ్వులు, తులసి ఆకులు, పంచామృతంతో పూజ చేయాలి.
  • ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని భక్తితో జపించాలి.
  • రోజంతా ఫలాహారం లేదా నిరాహార ఉపవాసం ఆచరించాలి.
  • రాత్రి సమయంలో భజనలు, కీర్తనలు చేస్తూ విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి.
  • ద్వాదశి రోజున బ్రాహ్మణులకు లేదా పేదవారికి భోజనం పెట్టి ఉపవాసాన్ని విరమించాలి.
  • ఉపవాస సమయంలో మనస్సు, మాట, ప్రవర్తన పవిత్రంగా ఉంచుకోవాలి.

పాప విముక్తి కోసం చేయాల్సిన సాధనలు

  • దేవుని ముందు మీ తప్పులను ఒప్పుకుని క్షమాపణ కోరండి.
  • తులసి మొక్కకు నీరు సమర్పించి ప్రదక్షిణ చేయండి.
  • విష్ణు సహస్రనామం లేదా హరినామ సంకీర్తనం పారాయణం చేయండి.
  • సత్యం, కరుణ, నియమం, నిగ్రహాన్ని ఆచరించండి.

ఏకాదశి రోజున దానధర్మం ప్రాముఖ్యత

సనాతన సంప్రదాయంలో దానం గొప్ప పుణ్యకార్యంగా భావించబడుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున చేసే దానధర్మం అత్యంత శుభఫలితాలను ఇస్తుందని పురాణాలు పేర్కొంటాయి. ఆహారం, వస్త్రాలు, గోవు లేదా దక్షిణ దానం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పాపమోచని ఏకాదశి అనేది స్వీయశుద్ధి, ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక మేల్కొలుపుకు దారి చూపే పవిత్రమైన రోజు. ఈ పవిత్ర సందర్భంగా ఉపవాసం, జపం, ధ్యానం, దానధర్మం చేయాలని సంకల్పించి శ్రీహరిని భక్తితో ఆరాధిస్తే, జీవితం ధర్మమార్గంలో ముందుకు సాగుతుంది, మోక్షమార్గం సులభమవుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us