AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుజుకీ స్కూటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త రంగుల్లో యాక్సెస్ 125 !!

మారుతున్న కాలానుగుణంగా బైకుల కంటే కూడా ప్రస్తుతం స్కూటర్/స్కూటీలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కాగా స్కూటీ కొనాలనుకునే వారికి సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి పరిచయమే. ఇప్పుడు ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సుజుకి సంస్థ మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది.

సుజుకీ స్కూటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త రంగుల్లో యాక్సెస్ 125 !!
Suzuki Access 125
Korivi Jayakumar
|

Updated on: Nov 25, 2026 | 10:45 PM

Share

మారుతున్న కాలానుగుణంగా బైకుల కంటే కూడా ప్రస్తుతం స్కూటర్/స్కూటీలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కాగా స్కూటీ కొనాలనుకునే వారికి సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి పరిచయమే. స్టైలిష్ డిజైన్, రోజువారీ ప్రయాణాలకు అనువైన ఫీచర్లు.. సౌకర్యవంతమైన రైడింగ్‌తో ఈ స్కూటర్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సుజుకి సంస్థ మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ రంగులను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా కొన్ని వేరియంట్లలో రంగుల ఎంపికను కూడా మార్చింది.

సుజుకి అధికారిక ప్రకటన ప్రకారం కొత్త కలర్ లైనప్ నవంబర్ 23, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి షోరూమ్‌లో అన్ని రంగులు, వేరియంట్లు ఒకేసారి స్టాక్‌లో ఉండకపోవచ్చు. ముఖ్యంగా మీకు నచ్చిన కలర్, వేరియంట్ అందుబాటులో ఉందో లేదో ముందుగా డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. డెలివరీ సమయం కూడా షోరూమ్ స్టాక్, బుకింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125 వేరియంట్లు.. వాటి ధరలు, ఫీచర్లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

రెండు కొత్త రంగులు..

  • సుజుకి పరిచయం చేసిన కొత్త రంగుల్లో మొదటిది మెటాలిక్ రాయల్ బ్రాంజ్. ఈ కలర్ రైడ్ కనెక్ట్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్లలో అందుబాటులో ఉంటుంది.
  • రెండోది మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్. ఈ రంగును టాప్-ఎండ్ రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్‌లో మాత్రమే అందిస్తున్నారు.

ఇవే కాకుండా మరికొన్ని వేరియంట్లలోనూ రంగుల ఎంపికను మార్చారు. రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ ABS వేరియంట్లలో పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ కలర్‌ను కొత్తగా చేర్చారు. స్టాండర్డ్ ఎడిషన్‌లో సాలిడ్ ఐస్ గ్రీన్ రంగును అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పెషల్ ఎడిషన్‌లో మాత్రం పాత రంగుల ఎంపికనే కొనసాగిస్తున్నారు.

సుజుకి యాక్సెస్ 125 వేరియంట్లు, ధరలు..

కొత్త కలర్ లైనప్‌తో సుజుకి యాక్సెస్ 125 ప్రస్తుతం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.

  • స్టాండర్డ్ ఎడిషన్: రూ.83,086
  • స్పెషల్ ఎడిషన్: రూ.89,428
  • రైడ్ కనెక్ట్ ఎడిషన్: రూ.91,627
  • రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్: రూ.98,432
  • రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్: రూ.1,03,780

ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర పన్నుల ఆధారంగా ఆన్-రోడ్ ధరలు మారుతాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని సుజుకి షోరూమ్‌లో పూర్తి ధరను తెలుసుకోవాలి.

ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి?

  • స్టాండర్డ్ ఎడిషన్: తక్కువ బడ్జెట్‌లో యాక్సెస్ 125 కొనాలనుకునే వారికి ఇది ప్రారంభ వేరియంట్. అవసరమైన ప్రాథమిక ఫీచర్లతో వస్తుంది.
  • స్పెషల్ ఎడిషన్: స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే అదనపు డిజైన్, కలర్ ఎంపికలు కోరుకునే వారికి ఈ వేరియంట్ అందుబాటులో ఉంది.
  • రైడ్ కనెక్ట్ ఎడిషన్: బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.
  • రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్: రైడ్ కనెక్ట్ ఫీచర్లతో పాటు సింగిల్ ఛానల్ ABS సదుపాయం ఉంటుంది. బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
  • రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్: ఇందులో 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్‌తో పాటు సింగిల్ ఛానల్ ABS కూడా అందుబాటులో ఉన్నాయి.

మీ బడ్జెట్, అవసరాలను బట్టి వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ ధరలో స్కూటర్ కావాలనుకునేవారు స్టాండర్డ్ లేదా స్పెషల్ ఎడిషన్‌ను పరిశీలించవచ్చు. నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కావాలనుకునేవారు రైడ్ కనెక్ట్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు ABS ఉన్న రైడ్ కనెక్ట్ ABS లేదా TFT ABS వేరియంట్లను పరిశీలించవచ్చు. ఇక కలర్ డిస్‌ప్లే, ప్రీమియం ఫీచర్లు కావాలనుకునేవారికి టాప్-ఎండ్ TFT ABS ఎడిషన్ అందుబాటులో ఉంది.

ఇంజిన్, మైలేజ్, ఇతర ఫీచర్లు..

సుజుకి యాక్సెస్ 125లో 125సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించారు. రోజువారీ ప్రయాణాలకు అనువైన పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని అందించేలా ఈ ఇంజిన్‌ను రూపొందించారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 24.4 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, బయటివైపు ఫ్యూయల్ లిడ్, విశాలమైన ఫుట్‌బోర్డ్, పొడవైన సీటు ఉన్నాయి. అయితే వాస్తవ మైలేజ్ రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్, రైడింగ్ విధానాన్ని బట్టి మారుతుంది.

Follow Us