AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీ కేబినెట్‌కు వేళాయే.. ఈ అంశాలపైనే ప్రత్యేకంగా చర్చించనున్న సీఎం చంద్రబాబు..!

ఏపీ కేబినెట్‌కు వేళైంది. రేపు ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఏపీలో ప్రధానమంత్రి మోదీ పర్యటనతోపాటు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ.. ఈ మీటింగ్‌లో ఏయే అంశాలపై ప్రభుత్వం చర్చించబోతోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

Andhra: ఏపీ కేబినెట్‌కు వేళాయే.. ఈ అంశాలపైనే ప్రత్యేకంగా చర్చించనున్న సీఎం చంద్రబాబు..!
CM Chandrababu PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2025 | 9:51 PM

Share

ఏపీ కేబినెట్ శుక్రవారం సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయే ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా.. ఏపీలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించనుంది. ఈ నెల 16న ఏపీలో మోదీ పర్యటిస్తారు. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత.. కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తారు. జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేలా ఈ ర్యాలీ చేపడుతోంది ఎన్డీఏ.

దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా.. ఏపీలోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 60వేలకుపైగా సభలు, సమావేశాలు పెట్టాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. వాటికి సంబంధించిన ప్రణాళికపై కేబినెట్‌లో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించే అవకాశం

అమరావతి రాజధానిలో పనులు, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపైనా కేబినెట్ చర్చించనుంది. పలు సీఆర్డీఏ ప్రతిపాదనలనూ ప్రభుత్వం ఆమోదించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులపై చర్చించే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకంపైనా కేబినెట్ చర్చించనుంది.

అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15వేల పథకం

ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి 15వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ఇవాళే ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఈ అంశాన్ని కూడా కేబినెట్‌లో సీం ప్రస్తవించే అవకాశం ఉంది.

మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్న చంద్రబాబు

కేబినెట్ తర్వాత.. రాజకీయ అంశాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల జరిగిన అసెంబ్లీ తీరు, వివాదాలకు దారితీసిన కొంత మంది ఎమ్మెల్యేల అంశం ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపైనా మంత్రులతో చర్చిస్తారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఎలా నడుచుకోవాలి? ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..