Andhra Pradesh: స్కూల్ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!
మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నియమనిబంధనలు ఉన్నా కొంతమంది బడి, గుడి, నివాస సముదాయాల సమీపంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం వివాదాలకు దారి తీస్తోంది. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓ బార్ అండ్ రెస్టారెండ్..

ఒంగోల్, మార్చి 4: ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసేస్తున్నారు. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నియమనిబంధనలు ఉన్నా కొంతమంది బడి, గుడి, నివాస సముదాయాల సమీపంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం వివాదాలకు దారి తీస్తోంది. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓ బార్ అండ్ రెస్టారెండ్ స్కూలుకు సమీపంలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు.
గుడి, బడి అనే తేడా లేకుండా, మద్యం షాపులు ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ ను ఎత్తివేయాలని విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో షాపు ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. తరగతులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. డిఎస్‌ఆర్ పేరుతో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ పాఠశాల, రామాలయం సమీపంలో ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్ధి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మద్యం షాప్ తొలగించేంత వరకు బడికి వెళ్ళేది లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై విద్యార్ధి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం బార్ అండ్ రెస్టారెంట్ తొలగించి చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులకు, అనంతరం సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




