మామిడి పండ్లు కొంటున్నారా? కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లను ఎలా గుర్తించాలంటే..
వేసవిలో మామిడి పండ్లను ఆస్వాదించే ముందు జాగ్రత్త. వ్యాపారులు త్వరగా పండించడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి కార్బైడ్ వంటి రసాయనాలు వాడుతున్నారు. ఇవి క్యాన్సర్, సంతానలేమి, పీసీఓఎస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కృత్రిమంగా పండించిన పండ్లను గుర్తించి, అధికారులుకు ఫిర్యాదు చేయడం ముఖ్యం.

వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. భారతదేశం ప్రపంచంలోనే మామిడిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో టాప్ ప్లేసులో ఉంటుంది. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, అల్ఫోన్సా, గోవా, కేసర్ వంటి అనేక రకాల మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మామిడి పండు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా పండ్లు రసాయనాలతో పండించినవే. వ్యాపారులు మామిడి పండ్లను త్వరగా పండించడానికి, అలాగే చూడగానే మంచిగా కనిపించడానికి కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను విరివిగా వాడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారుతోంది. పెరుగుతున్న రసాయన కలుషితం నేటి ఆహారపు అలవాట్లను, ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పురుగుల మందుల నుంచి హార్మోన్లు, ఇతర రసాయనాల వరకు, ఆహార పదార్థాలు కలుషితమైపోతున్నాయి.
రసాయనాలతో పండిన మామిడి పండ్లను తినడం వల్ల మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో 10-12% ఉన్న సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ) సమస్య ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అలాగే, ఊబకాయం (ఒబేసిటీ), పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి సమస్యలు ముఖ్యంగా టీనేజ్ బాలికల్లో చాలా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. పీసీఓఎస్ కారణంగా నెలసరి సరిగా రాకపోవడం, జుట్టు రాలడం, మొటిమలు ఎక్కువగా రావడం, బరువు పెరిగిపోవడం వంటి సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్లలో భాగాలు. మామిడి పండ్లే కాకుండా, ఇతర ఆహార పదార్థాలు కూడా ఇలాగే కలుషితం అవుతున్నాయి. పీసీఓఎస్‌కు రసాయనాలతో కూడిన ఆహారం ఒక ప్రధాన కారణం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మామిడిపండ్లు అనేక ఆరోగ్య సమస్యలకు మూలంగా మారుతున్నాయి. ప్రభుత్వము, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కూడా ఈ రసాయనాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించాయి. కార్బైడ్ క్యాన్సర్ కలిగించే హానికరమైన రసాయనమని స్పష్టం చేశాయి. ఈ కెమికల్ మన మెదడులోని కణాలను దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది పిల్లలలో, పెద్దవారిలో, ఆడవారిలో, గర్భస్థ శిశువులలో కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
కార్బైడ్‌తో మాగబెట్టిన మామిడి పండ్లు గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలు:
1. వాసన (సువాసన): సహజంగా మాగిన మామిడి పండ్లకు ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది. కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లలో ఈ వాసన ఉండదు.
2. లోపల రంగు ఎలా ఉంది?: పండును కోసి చూసినప్పుడు లోపల పసుపు రంగు సమానంగా ఉంటే సహజంగా మాగినదై ఉండే అవకాశం ఉంది. బయట పసుపు, లోపల పచ్చగా లేదా తెల్లగా ఉంటే జాగ్రత్తపడాలి
3. పైభాగం రంగు (బయటి లుక్): చాలా సమానంగా, ఒకేసారి పసుపు రంగులో కనిపిస్తే అనుమానం ఉండొచ్చు సహజంగా మాగిన పండ్లు పచ్చ-పసుపు మిశ్రమంగా ఉంటాయి
4. మచ్చలు, మరకలు: పండుపై అసహజమైన మచ్చలు కనిపించవచ్చు. అయితే ఇది ఒక్కటే ఆధారం కాదు — సహజ పండ్లలో కూడా మచ్చలు ఉండొచ్చు.
5. పై తొక్క & లోపల గుజ్జు: బయట బాగా పండినట్లు ఉన్నా, లోపల పూర్తిగా మగ్గకపోవచ్చు
6. రుచి: సహజ పండ్లు తీపిగా, రసంతో నిండుగా ఉంటాయి. కార్బైడ్ పండ్లు కొద్దిగా ఫ్లాట్‌గా లేదా సహజ రుచి లేకుండా అనిపించవచ్చు.
7. చేతిలో ఫీల్: సహజంగా మాగిన పండ్లు కొంచెం మృదువుగా, సహజమైన ఫీల్ ఇస్తాయి. కార్బైడ్ పండ్లు కొంచెం అసహజంగా గట్టిగా లేదా డెడ్ లా అనిపించవచ్చు.
ముఖ్యమైన సూచన ఏంటంటే పై లక్షణాల్లో ఒక్కటి చూసి నిర్ణయం తీసుకోవద్దు. 2–3 లక్షణాలు కలిపి చూసినప్పుడే సరైన అంచనా వేయాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ల్యాబ్ పరీక్ష అవసరం.
వీలైతే స్థానిక రైతుల వద్ద నుంచి కొనడం మంచిది. వారు అయితే మనం తెలుసు కాబట్టి స్వచ్చమైన పండ్లను ఇచ్చే అవకాశం ఉంటుంది
కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లను మీరు మార్కెట్లో గుర్తించినట్లయితే, వాటిని కొనుగోలు చేయకుండా ఉండటమే కాకుండా, తగిన చర్యలు తీసుకోవాలి. అటువంటి వ్యాపారులపై పోలీసు వారికి లేదా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి, రసాయన రహిత మామిడి పండ్లను ఎంచుకోవడం ద్వారా మనం, మన కుటుంబం సురక్షితంగా ఉండవచ్చు.
