అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?
ఏలూరు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలతో ఉన్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మృతుడిగా నమోదు చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీని ఆశ్రయించిన మురళీకృష్ణకు.. రికార్డుల్లో తాను ఇప్పటికే చనిపోయినట్లు నమోదై ఉందని తెలియడంతో షాక్‌కు గురయ్యాడు. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఉన్నతాధికారులను కోరుతున్నాడు.

ఏలూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యమో.. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన కుట్రో తెలియదు కానీ, ప్రాణాలతో ఉన్న ఓ వ్యక్తిని ప్రభుత్వ రికార్డులు మాత్రం మృతుడిగా తేల్చేశాయి. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం పొందేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వ రికార్డుల్లో తాను ఇప్పటికే మృతి చెందినట్లు నమోదై ఉందని తెలియడంతో బాధితుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన యర్రంశెట్టి మురళీకృష్ణకు ఈ వింత అనుభవం ఎదురైంది. మురళీకృష్ణ, ఆయన భార్య రమాదేవి కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల మురళీకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకోవాలని మురళీకృష్ణ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించాడు. ఆసుపత్రి సిబ్బంది మురళీకృష్ణ ఆధార్ వివరాలను ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో పరిశీలించగా.. ప్రభుత్వ రికార్డుల్లో ఆయన ఇప్పటికే మృతి చెందినట్లు నమోదు అయి ఉన్న విషయం బయటపడింది.
దీంతో ఆసుపత్రి సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పడంతో మురళీకృష్ణ ఆసుపత్రి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. తాను ప్రాణాలతో ఉండగా ప్రభుత్వ రికార్డుల్లో తనను మృతుడిగా ఎవరు, ఎందుకు నమోదు చేశారో తెలియక ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారంటున్న బాధితుడు
తనకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పేరుతో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారని మురళీకృష్ణ ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును వెంటనే పునరుద్ధరించి, తనకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి ఆపరేషన్ చేయించాలని మురళీకృష్ణ, ఆయన తమ్ముడు శ్రీనివాస్ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
ప్రాణాలతో ఉన్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మృతుడిగా నమోదు చేయడం ఎలా జరిగింది? ఈ వ్యవహారం వెనుక ఎవరి పాత్ర ఉంది? తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ అయింది? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
