తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల ఆలయంలో ప్రతియేటా వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. శ్రీవారికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలను సృష్టికర్త బ్రహ్మదేవుడే జరిపించినట్లు హిందూ పురాణాల్లో పేర్కొనబడింది. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రారంభించిన ఉత్సవాలు కావడంతో దీనికి ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చిందని చెబుతారు. అయితే పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు అయినందున దీన్ని ‘బ్రహ్మోత్సవాలు’ అంటున్నారని మరికొందరి భావన. శ్రీవారి బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి పులకించిపోతారు.
అంకురార్పరణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాల్లో.. మలయప్ప స్వామికి వాహన సేవలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ధ్వజారోహణం, రెండోరోజు చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం, హంస వాహన సేవలు నిర్వహిస్తారు. మూడో రోజు సింహ వాహనం, అదే రోజు రాత్రి ముత్యాలపందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతారు. నాలుగో రోజు కల్పవృక్ష వాహనం, అదే రోజు సాయంత్రం సర్వభూపాల సేవ, ఐదో రోజు మోహినీ అవతారం, హనుమ వాహనం, గరుడ వాహన సేవ, ఆరో రోజు గజ వాహనం, ఏడో రోజు సూర్య ప్రభ, అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, ఎనిమిదో రోజు రథోత్సవం, తొమ్మిదో రోజు చక్రస్నానం, అదే రోజు ధ్వజావరోహణ నిర్వహిస్తారు.