- Telugu News Photo Gallery Spiritual photos Srivari annual brahmotsavam 2025: Sri Malayappa Swamy Darshan on hamsa vahana seva
Tirumala: హంసవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం .. అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని ప్రసాదిస్తాడని నమ్మకం.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామి వారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
Updated on: Sep 26, 2025 | 6:50 AM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం రాత్రి హంస వాహన సేవవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.

శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించిజ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 21 కళాబృందాలు 536 మంది కళాకారులు తమ ప్రత్యేక నృత్యాలు, వాయిద్యాలు, భజనలతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు.

కేరళకు చెందిన కళాకారులు కథాకళి, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళలు కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు, తప్పెటగుళ్ళు కనువిందు చేసింది.

గుజరాత్ చెందిన వారు గర్భా నృత్యం, అస్సాంకి చెందిన కళాకారులు సత్రియ నృత్యం, రాజస్థాన్ కి చెందిన కళాకారులు జఖరీ నృత్యం, ఝార్ఖండ్ వారు చౌ నృత్యంతో అలరించారు.

మహారాష్ట్రకి చెందిన కళాకారులు లావణి, పశ్చిమ బెంగాల్ కి చెందిన కళాకారులు రాధాకృష్ణ రాసలీల, కర్ణాటకకి చెందిన కళాకారులు హనుమాన్ చాలీసా నృత్య రూపకం, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాకారుల డ్రమ్స్ వాయిదాలతో భక్తులను మైమరిపించాయి. అదేవిధంగా దీపం నృత్యాలు, భజనలు, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి.

ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులుపా ల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.




