- Telugu News Photo Gallery Spiritual photos Tirumala srivari salakatla brahmotsavam 2025: Rathotsavam held grand scale
Tirumala: వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. మనుషులకు తత్వ జ్ఞానాన్ని భోదించేదే రథోత్సవం సమయంలో మాడవీధులు గోవిందనామస్మరణతో మారుమోగాయి.
Updated on: Oct 01, 2025 | 12:59 PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

అనాదికాలం నుంచి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు.

శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు.

సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, సహా ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.




