AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలిగొండలో కృష్ణమ్మ పరుగులు.. నల్లమల సాగర్‌ కళకళ.. పర్యాటకుల సందడి!

శ్రీశైలం నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్‌ను చేరాయి. సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిస్తోంది. తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగు, 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఇది కరవు ప్రాంతాలకు జీవనాధారం, పర్యాటక ఆకర్షణగా మారి ప్రజలను సంబరాలకు గురిచేస్తోంది.

వెలిగొండలో కృష్ణమ్మ పరుగులు.. నల్లమల సాగర్‌ కళకళ.. పర్యాటకుల సందడి!
Nallamala Sagar
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 22, 2026 | 8:38 PM

Share

శ్రీశైలం నుంచి వెలిగొండ సొరంగాల నుంచి ప్రవహించి ఫీడర్‌ కెనాల్‌ ద్వారా వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ కళకళలాడుతోంది. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. గత నెల ఆగస్టు 31వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు 500 క్యూసెక్కులతో ప్రారంభించి క్రమేపీ నీటి పరిమాణాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆ తరువాత రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ కొల్లంవాగు దగ్గర హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి విడుదలవుతున్న నీరు 18 కిలో మీటర్ల సొరంగం ద్వారా ఫీడర్‌ కాలువలోకి చేరుకుంటుంది. 21 కిలో మీటర్ల మేర ఫీడర్‌ కాలువలో ప్రవహించి నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరుకుంటున్నాయి.

మొదటి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ఫీడర్ కెనాల్ దగ్గర ఆగస్టు 31వ తేదీన సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, కడపజిల్లా ప్రాంత ప్రజల దశాబ్దాల కలల పంటగా ఉన్న వెలిగొండ జలాలను ఆగస్టు 31, 2026 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందుబాటులోకి రానుంది.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం తర్వాత శ్రీశైలం వరద జలాలను నల్లమల సాగర్‌ జలాశయానికి మళ్లిస్తున్నారు. నల్లమల సాగర్‌లో 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్ధ్యంతో నిర్మించారు. అయితే ప్రస్తుతం తొలిదశ కింద 10.70 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తారు. నల్లమల సాగర్ రిజర్వాయర్‌ నుంచి మూడు ప్రధాన కాలువల ద్వారా ప్రాజెక్టు ఆయకట్టులోని సాగుభూములకు నీరు అందిస్తారు.

మరోవైపు కరవు సీమలో కృష్ణమ్మ పరుగులు పెడుతుండడంతో వెలిగొండ ప్రాంతం పర్యాటక శోభ సంతరించుకుంది. ప్రాజెక్టు సొరంగం దగ్గర, ఫీడర్‌ కెనాల్‌ దగ్గర కృష్ణమ్మ పరుగులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులే కాకుండా, దూర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కృష్ణ జలాలకు జలహారతి, పూజలు నిర్వహిస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌లో కృష్ణాజలాలను చూసేందుకు మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి రైతులు, మహిళలు యువకులు తరలివస్తున్నారు. కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు. దోర్నాల మండలం గంటవానిపల్లె దగ్గర ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పైలాన్, ప్రాజెక్టు గేట్లు, జలహారతి ప్రదేశం, నీటి ప్రవాహాలు, శిలా ఫలకాలు, నీటి నిల్వల దృశ్యాలను చూసి సంబరపడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టి హల్‌చల్‌ చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజారి ఉండడంతో అక్కడికి వెళ్లిన వారు జలహారతి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి కలలు కన్న ప్రాజెక్టు తమ కళ్ల ముందే ప్రవహిస్తుంటే ఆనందంతో మురిసిపోతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

Follow Us