వినాయక చవితి
వినాయక చవితి..భారత దేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతియేటా భాద్రపద మాసం శుక్ల చతుర్థినాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగనే వినాయక చతుర్థి, గణేశ చతుర్థి అని కూడా పిలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు గణేశ విగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకుని.. ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తారు.
గ్రామాలు, నగరాల్లోని బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో అందరూ కలిసి వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి మహోత్సవాలు కూడా కీలక పాత్ర పోషించారు. 1892లో దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించేందుకు స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్.. గణపతి ఉత్సవాలను ప్రారంభించారు.