Ganesh Utsav: గణపతికి వీడ్కోలు పలికి.. వీటిని దానం చేయండి.. సుఖసంతోషాలు మీ సొంతం
వినాయక చవతి రోజు నుంచి భక్తులతో పూజలను అందుకుంటున్న బొజ్జ గణపయ్య అనంత చతుర్దశి రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. వినాయకుడిని ఎంతో వైభవంగా అత్యంత భక్తిశ్రద్దలతో నిమజ్జనం చేస్తారు. అయితే వినాయకుడి నిమజ్జనం అనంతరం కొన్ని వస్తువులను దానం చేస్తే.. గణేశుడి ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయని నమ్ముతారు. ఆ రోజున చేసే దానం కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

గణపతి బప్పా నిష్క్రమణ సమయం దగ్గర పడుతోంది. ఈ సంవత్సరం అనంత చతుర్దశి సెప్టెంబర్ 6, 2025న జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుతో గణేశోత్సవాలు ముగుస్తాయి. భక్తులు వచ్చే ఏడాది తిరిగి మళ్ళీ మా ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తూ.. భావోద్వేగ హృదయంతో గణేశుడికి వీడ్కోలు పలుకుతారు. మత విశ్వాసాల ప్రకారం బప్పా నిమజ్జనం అనంతరం కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తే.. గణపతి ఆశీస్సులు ఏడాది పొడవునా మీ కుటుంబంపై ఉంటాయి. అనంత చతుర్దశి రోజున ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో ఈ రోజు తెలుసుకోండి.
ఆహారం, వస్త్ర దానం గణేష్ నిమజ్జనం తర్వాత ఆహారం, వస్త్రాలను దానం చేయడం చాలా పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది. మీరు బియ్యం లేదా పప్పులు వంటి ధాన్యాలు , కొత్త వస్త్రాలను పేదలకు లేదా అవసరం ఉన్న వారికి దానం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా గణేష్ సంతోషిస్తాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
బెల్లం దానం బెల్లం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గణేశునికి ఇష్టమైన నైవేద్యంగా కూడా పరిగణించబడుతుంది. అనంత చతుర్దశి రోజున బెల్లం దానం చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. గుడిలో లేదా పేదవారికి బెల్లం దానం చేయవచ్చు. ఇది జీవితంలో తీపి, ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు.
కొబ్బరి దానం కొబ్బరికాయను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. శుభకార్యాలలో ఉపయోగిస్తారు. గణపతి నిమజ్జనం తర్వాత కొబ్బరికాయను దానం చేయడం చాలా ఫలవంతమైనది. కొబ్బరికాయను ప్రవహించే నదిలో విడవవచ్చు లేదా అవసరమైన వ్యక్తికి ఇవ్వవచ్చు. ఈ దానం జీవితంలో ఏర్పడిన ప్రతికూలతను తొలగించడంలో సహాయపడుతుంది.
కుడుములు, స్వీట్ల దానం కుడుములు గణేశునికి ఇష్టమైన వంటకం. గణపతి నిమజ్జనం తర్వాత కుడుములు లేదా ఇతర స్వీట్లు పంచి పెట్టడం చాలా శుభప్రదం. ఆలయంలో లేదా పేదలకు కుడుములు, స్వీట్లు పంపిణీ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని.. కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
నిమజ్జనం తర్వాత దానం ఎందుకు చేయాలంటే హిందూ మతంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. గణపతిని విఘ్నాధిపతి అని పిలుస్తారు. నమ్మి కొలిచిన భక్తుల ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు లేకుండా చూసుకుంటాడు. కనుక వినాయకుడి విగ్రహన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఆయన అనుగ్రహం కోసం ఖచ్చితంగా దానధర్మాలు చేస్తారు. ఈ దానధర్మాలు చేయడం వలన ఇంట్లో పేదరికం తొలగి అదృష్టాన్ని పెంచుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)








