స్వయంగా పార్వతీదేవి ప్రతిష్టించిన గణపతి.. ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు నెలవు.. దర్శనంతోనే శని దోష నివారణ..
పచ్చని అడవి మధ్య, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గణపతి ఆలయంలో గణపతి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తున్నాడు. భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు. చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా..ఈ ఆలయం వెనుక ఉన్న శక్తి అపారమైనదని భక్తులు చెబుతారు. స్వయంగా పార్వతి దేవి శని గ్రహ దోషం నుంచి ఉపశమనం కోసం తపస్సు చేసిన ప్రాంతం.. తన తపస్సుకి ఎటువంటి అడ్డంకులు రాకుండా స్వయంగా గణపతిని ప్రతిష్టించి పూజించిన శక్తివంతమైన గణపతి ఆలయం ఎక్కడ ఉందో ? నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం...

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేసవే గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం. ఈ గణపతి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన దృశ్యాలతో భక్తులను అలరిస్తుంది. వైభవంతో పాటు, వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం గురించి ఆధ్యాత్మికంగా అనేక కథలున్నాయి. ఇక్కడ గణపతిని పార్వతి దేవి పూజలు చేసిందని నమ్మకం. కమండల గణపతి ఆలయంలో పూజలు చేయడం.. ముఖ్యంగా మహిళలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ గణేశ ఆలయంలో పూజలు చేసినా లేదా ధ్యానం చేసినా గణేశుడి ఆశీస్సులు లభిస్తాయని.. శని దోషంతో బాధపడే వారికి ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
పురాణం కథ ఏమిటంటే..
పార్వతి దేవి ఒకప్పుడు శానీస్వరుడి దుష్ప్రభావాలతో బాధపడింది. శని దోషం నుంచి ఉపశమం కోసం దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మృగవధేలో పార్వతీ దేవి తపస్సును ఆచరించడానికి నిర్ణయించుకుంది. తన తపస్సుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా పార్వతి దేవి ముందుగా గణేశుడికి పూజ చేయాలనీ భావించి.. ఇప్పుడున్న ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించింది.
ధ్యానంలో మునిగిపోయిన పార్వతి శని దోషం నుంచి విముక్తి పొందింది. శని దోషం నుంచి విముక్తి పొందిన పార్వతి దేవి, తాను ప్రతిష్టించిన గణపతికి అభిషేకం చేయడానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది. కానీ పార్వతి ఎక్కడా నీరు దొరకలేదు. అప్పుడు ఆమె నీటి కోసం బ్రహ్మను ప్రార్థించింది. ఈ సమయంలో, బ్రహ్మ దేవుడు తన కమండలం నుంచి నీరు చిమ్మేలా చేశాడు. తర్వాత పార్వతి దేవి ప్రతిష్టించిన గణేశుడి ముందు బ్రాహ్మి నది ఉద్భవించింది. దీంతో ఇక్కడ గణేశుడిని కమండల గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది.
ఆలయంలో కమండల తీర్థంగా బ్రహ్మీ నది
బ్రహ్మ కమండలం నుంచి చల్లిన నీరు బ్రాహ్మి నది ఉద్భవించింది. అందుకనే ఈ నదిని కమండల తీర్థం, బ్రహ్మ దేవుడు సృష్టించాడు కనుక బ్రాహ్మి నది అని పిలుస్తారు. బ్రాహ్మి నది తామర పువ్వు రేకుల మాదిరిగా చెక్కబడిన చిన్న చతురస్రాకార రాతి వేదికలోని రంధ్రం నుంచి ఉద్భవించింది. ఈ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది నేటికీ రహస్యమే.
పవిత్ర జలం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుంది, శని దోషం తొలగిపోతుంది
గణపతి ఆలయ గర్భగుడిలో ఉద్భవించిన బ్రాహ్మి నది, ఆలయం ముందు పవిత్ర జలం రూపంలో ప్రవహించి పడిపోతుంది. ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే, శని దోషం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర జలంలో స్నానం చేసి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. అంతే కాదు పిల్లలు ఇక్కడ పవిత్ర జలం తాగితే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుందని, పరీక్షలలో మంచి మార్కులు కూడా వస్తాయని భక్తుల విశ్వాసం.
ఆలయం ఎక్కడ ఉంది: శ్రీ కమండల గణపతి ఆలయం చిక్కమగళూరు జిల్లాలోని కొప్ప తాలూకా నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసవే అనే చిన్న గ్రామంలో ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








