AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో ప్రసాదంగా నూడుల్స్, పిజ్జా.. దేశాలు దాటిన ఈ ఆలయ చరిత్ర.. ఎక్కడుందో తెలుసా..?

భారతీయ భక్తి.. చైనీస్ సంప్రదాయం.. ఈ రెండింటి అద్భుత సంగమమే కోల్‌కతాలోని చీనా కాళీ బారి. దశాబ్దాల క్రితం చైనా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు, బెంగాలీ సంస్కృతిని గుండెలకు హత్తుకుని నిర్మించిన ఈ ఆలయం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. నైవేద్యంగా నూడుల్స్, సూప్ సమర్పించే ఈ వింత ఆచారం వెనుకున్న విషయాల గురించి తెలుసుకుందాం..

గుడిలో ప్రసాదంగా నూడుల్స్, పిజ్జా.. దేశాలు దాటిన ఈ ఆలయ చరిత్ర.. ఎక్కడుందో తెలుసా..?
Noodles And Pasta As Prasad
Krishna S
|

Updated on: Apr 04, 2026 | 9:06 PM

Share

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్తే ప్రసాదంగా లడ్డూలు, పులిహోర లేదా పండ్లు ఇస్తారు. కానీ ఒక ఆలయంలో మాత్రం అమ్మవారికి నూడుల్స్, మోమోస్, పాస్తా, పిజ్జాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. దేశ సాంస్కృతిక రాజధాని కోల్‌కతాలోని చైనాటౌన్‌గా పిలవబడే టాంగ్రా ప్రాంతంలో ఉన్న చీనా కాళీ బారి విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చైనీస్ సంస్కృతి.. బెంగాలీ భక్తి

ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. కోల్‌కతాలోని టాంగ్రా ప్రాంతంలో స్థిరపడిన చైనీస్ కమ్యూనిటీ సభ్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. తోలు పరిశ్రమలో పనిచేస్తూ ఇక్కడే స్థిరపడిన వారు, స్థానిక బెంగాలీ సంస్కృతిని స్వీకరించి కాళీ మాతపై అపారమైన భక్తిని పెంచుకున్నారు. తమ సంప్రదాయాలకు, స్థానిక భక్తిని జోడించి ఈ విలక్షణమైన ఆలయానికి రూపకల్పన చేశారు.

నైవేద్యంలోనే అసలైన ట్విస్ట్

ఈ ఆలయాన్ని ఇతర ఆలయాల కంటే భిన్నంగా నిలిపేది అక్కడ ఇచ్చే ప్రసాదం. భక్తులు అమ్మవారికి తమకు ఇష్టమైన చౌమీన్ , మోమోస్, సూప్, పిజ్జాలను నైవేద్యంగా పెడతారు. పూజ అనంతరం భక్తులకు అవే పదార్థాలను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. తమ ఆహార వారసత్వాన్ని దైవానికి సమర్పించడం ద్వారా కృతజ్ఞత చాటుకోవడం వీరి ప్రత్యేకత.

హిందూ ఆచారాలతోనే పూజలు

నైవేద్యం వెరైటీగా ఉన్నప్పటికీ, పూజా విధానం మాత్రం పూర్తి హిందూ సంప్రదాయబద్ధంగానే సాగుతుంది. ఆలయంలో కాళీ మాతతో పాటు శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి. పూజారులు మంత్రోచ్ఛారణలతో, హారతులతో నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. మతాలు, దేశాల సరిహద్దులు దాటి భక్తి ఎలా వెల్లువెత్తుతుందో చెప్పడానికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యం.

పర్యాటక ఆకర్షణగా టాంగ్రా

ఈ వింత ఆచారం గురించి తెలుసుకున్న పర్యాటకులు దేశవ్యాప్తం నుండి ఇక్కడికి తరలివస్తున్నారు. ఆలయ దర్శనం తర్వాత పర్యాటకులు సమీపంలోని చైనాటౌన్ వీధుల్లో లభించే నోరూరించే ఇండో-చైనీస్ వంటకాలను రుచి చూడటం ఒక ఆనవాయితీగా మారింది. భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం ఎంతటి ప్రసిద్ధి అనేందుకు ఈ చైనీస్ కాళీ ఆలయమే నిదర్శనం. ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవిస్తూ, భక్తిలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆలయం నిజంగా చూడముచ్చటగా ఉంటుంది.

Follow Us