ఆకుకూరలు వారానికి ఎన్ని రోజులు తినాలి..? అందరూ తెలియక చేసే తప్పులు ఇవే..
మన ఇంట్లో పెద్దవాళ్లు ఎప్పుడూ ఆకుకూరలు తింటే ఆరోగ్యం అని చెప్తూనే ఉంటారు. కానీ మనలో చాలామందికి ఆకుకూరలు చూడగానే అదోలా అనిపిస్తుంది. అయితే వారంలో కనీసం మూడు రోజులు ఆకుకూరలు తిన్నా చాలు.. మన శరీరానికి కొండంత బలం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అసలు ఏ ఆకుకూర తింటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం..

మన నిత్య జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసినప్పటికీ, చాలామంది వాటిని తినడానికి కాస్త నిరాకరిస్తుంటారు. అయితే మీకు ఆకుకూరలు తినడం పెద్దగా ఇష్టం లేకపోయినా.. వారానికి కనీసం మూడుసార్లు అయినా వాటిని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ స్వరూప్ రాణి సూచిస్తున్నారు. ఆకుకూరల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. అయితే రోజువారీ ఆహారంలో ఒకే రకమైన ఆకుకూరను కాకుండా, రకరకాల ఆకుకూరలను మార్చి మార్చి తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.
ఏ ఆకుకూరతో ఎలాంటి ప్రయోజనం?
పాలకూర: పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ మరియు ల్యూటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మెంతి కూర: మెంతిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, జింక్, కాపర్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇది సరైన జీవక్రియకు, జీర్ణక్రియకు సహాయపడుతుంది. సమతుల్య ఆహారంతో పాటు మెంతి కూరను తీసుకుంటే బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
పుదీనా: విటమిన్ ఎ, సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు పుదీనాలో లభిస్తాయి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
కరివేపాకు: సాధారణంగా సువాసన, రుచి కోసం వాడే కరివేపాకులో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి.
కొత్తిమీర: ఫైబర్, విటమిన్లు, ఐరన్, మాంగనీస్ ఉన్న కొత్తిమీర రక్తపోటును, బరువును అదుపులో ఉంచడంలో దోహదపడుతుందని డాక్టర్ స్వరూప్ రాణి స్పష్టం చేస్తున్నారు.
సమతుల్య జీవనశైలే ముఖ్యం..
ఏ ఒక్క ఆకుకూర మాత్రమే శరీరంలోని అన్ని అనారోగ్య సమస్యలకు సంపూర్ణ నివారణ కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఆహారంలో వివిధ రకాల ఆకుకూరలతో పాటు సమతుల్య ఆహారం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి జీవనశైలిని పాటించడం అత్యంత ఆవశ్యకం.
