August 11, 2026
Subhash
ప్రతి దానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మారింది. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ నంబర్‌ను అలాగే యాక్టివ్‌గా ఉంటుందా.? ఆ డేటాను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుందాం.
ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని ఆధార్ యాక్టివ్‌గా ఉంటే దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. మోసగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
మోసగాళ్లు ఆ ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు తెరవడం, రుణాలు తీసుకోవడం, సిమ్ కార్డులు పొందడం.. ఇలాంటి మోసాల వల్ల కుటుంబ సభ్యులు కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.
యూఐడీఏఐ మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలను పూర్తిగా తొలగించదు. ఎందుకంటే ప్రతి ఆధార్ నంబర్ ప్రత్యేకమైనది. ఒకసారి కేటాయించిన ఆధార్ నంబర్‌ను మరో వ్యక్తికి ఎప్పటికీ ఇవ్వరు.
అలాగే ఆస్తుల యాజమాన్యం, బ్యాంకు ఖాతాలు, పన్ను రికార్డులు వంటి చట్టపరమైన అవసరాల కోసం పాత వివరాలను భద్రంగా ఉంచాల్సి ఉంటుంది.
అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన వేలిముద్రలు, ఐరిష్ స్కాన్, ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ వివరాలను శాశ్వతంగా లాక్ చేస్తారు. దీంతో వాటిని ఉపయోగించి ఎవరూ మోసాలకు పాల్పడలేరు.
UIDAI వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తూ మరణాల నమోదుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించే జనన, మరణ నమోదు వ్యవస్థ నుంచి వివరాలను పొందుతుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకులు, బీమా సంస్థల నుంచి ధృవీకరించిన సమాచారం ఆధారంగా రికార్డులను అప్‌డేట్ చేస్తుంది. మైఆధార్ పోర్టల్ ద్వారా కూడా మరణించిన వ్యక్తి వివరాలను నమోదు చేయవచ్చు
వ్యక్తి 12 అంకెల ఆధార్ నంబర్, మరణ నమోదు సంఖ్య, వ్యక్తిగత వివరాలు, డెత్ సర్టిఫికేట్, దరఖాస్తు చేస్తున్న కుటుంబ సభ్యుడి ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా OTPతో వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.