తొలి టెస్ట్‌కు ముందు షాకింగ్ న్యూస్.. మంచినీళ్ల కోసం గొడవ.. కట్‌చేస్తే.. కోచ్ దారుణ హత్య..!
Sumith Fernando Death: ఆటలో రాణించడం ఎంత ముఖ్యమో, కోపాన్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో మెలగడం అంతకంటే ముఖ్యం. క్షణికావేశంలో ఒక కుర్రాడు చేసిన తప్పు.. ఒక గొప్ప గురువు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, తన భవిష్యత్తును కూడా నాశనం చేసుకునేలా చేసింది. ఈ ఘటన నుంచి యువ క్రీడాకారులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

Sri Lanka Cricket Coach Murdered: శ్రీలంక క్రికెట్ వర్గాలను ఓ దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొలంబోలోని ఓ క్రికెట్ క్లబ్‌లో మంచినీళ్ల కోసం జరిగిన చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి ప్రాణాల మీదకు తెచ్చింది. సొంత ఆటగాళ్లే విచక్షణారహితంగా దాడి చేయడంతో 62 ఏళ్ల సీనియర్ కోచ్ సుమిత్ ఫెర్నాండో దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు.
అసలు గొడవ ఎలా మొదలైంది?
ఆగస్టు 8వ తేదీన కొలంబోలోని ప్రసిద్ధ బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్‌లో ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది. అండర్-17 స్థాయికి చెందిన కొంతమంది యువ క్రికెటర్లు అక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తీవ్రమైన శిక్షణ మధ్యలో విపరీతమైన దాహం వేయడంతో ఆ కుర్రాళ్లంతా మైదానంలో ఉన్న కుళాయి దగ్గరకు నీళ్లు తాగేందుకు వెళ్లారు. కానీ అప్పటికే అందులో నీటి సరఫరా నిలిచిపోయింది. చుక్క నీరు కూడా రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ఆటగాళ్లు.. అక్కడే ఉన్న గ్రౌండ్ సిబ్బందితో పెద్ద పెట్టున వాగ్వాదానికి దిగారు. పరిస్థితి క్రమంగా అదుపు తప్పుతుండటంతో, అదే క్లబ్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్న సుమిత్ ఫెర్నాండో గొడవను ఆపేందుకు మధ్యలో చొరబడ్డారు. కుర్రాళ్లను శాంతపరిచే ప్రయత్నం చేశారు. కానీ కోపంతో రగిలిపోతున్న ఆ యువ ఆటగాళ్లు కనీస విచక్షణ మరిచిపోయి కోచ్‌తోనే తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ఆ మాటా మాటా పెరిగి చివరకు భౌతిక దాడికి దారి తీసింది.
ఆస్పత్రిలో పోరాడుతూ కన్నుమూత..
కట్టలు తెంచుకున్న కోపంతో ఓ 17 ఏళ్ల యువ ఆటగాడు కోచ్ ఫెర్నాండోపై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఒక వృద్ధుడన్న కనీస కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఊహించని ఈ భౌతిక దాడిలో తీవ్రంగా గాయపడిన ఫెర్నాండో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన కొలంబో నేషనల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయనకు ముందు నుంచే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ రిపోర్టు వస్తే కానీ ఆయన మరణానికి కచ్చితమైన కారణం దాడి వల్ల జరిగిన గాయాలా లేక గుండెపోటా అనేది స్పష్టంగా తెలియదు. గురువారం నాడు కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ దారుణంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన మైనర్ క్రికెటర్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొలంబో కోర్టు ముందు హాజరుపరచగా, ఆగస్టు 17 వరకు అతడిని జువైనల్ హోమ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
కుశాల్ మెండిస్ లాంటి స్టార్లు ఆయన శిష్యులే..
శ్రీలంక దేశవాళీ క్రికెట్ చరిత్రలో సుమిత్ ఫెర్నాండోకు ఒక సువర్ణ అధ్యాయం ఉంది. మోరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో దశాబ్దాల పాటు ఆయన క్రికెట్ కోచ్‌గా సేవలందించారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన ఎంతో మంది పేద యువ ఆటగాళ్లలోని ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడంలో ఆయనది కీలక పాత్ర. ప్రస్తుతం శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ కూడా తన పాఠశాల రోజుల్లో ఫెర్నాండో దగ్గరే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. రిటైర్మెంట్ వయసులో కూడా క్రికెట్ పై ఉన్న పిచ్చితో బ్లూమ్‌ఫీల్డ్ క్లబ్‌లో క్యూరేటర్‌గా, కోచ్‌గా సేవలు అందిస్తున్న ఒక గొప్ప గురువు.. చివరకు తన శిష్యుడి వయసున్న కుర్రాడి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం క్రీడాభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.
భారత్ సిరీస్ ముంగిట ఉలిక్కిపడ్డ క్రీడాలోకం..
క్రికెట్ అంటేనే ఒక జెంటిల్‌మెన్ గేమ్. అందులో క్రమశిక్షణే పునాది. కానీ ఇలాంటి హింసాత్మక ఘటనలు ఆ క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చగా మారుతున్నాయి. మరోవైపు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంతటి కీలక సిరీస్ ముంగిట దేశవాళీ క్రికెట్‌లో చోటుచేసుకున్న ఈ హత్యోదంతం శ్రీలంక క్రికెట్ బోర్డును ఉలిక్కిపడేలా చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




