Team India: వైట్ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టెస్ట్‌ల్లో టీమిండియాకు విలన్ అతడేనా..?
Gautam Gambhir Test Coaching: తీవ్ర ఒత్తిడి, గాయాల సమస్యల మధ్య లంక పర్యటనకు సిద్ధమవుతున్న భారత జట్టు రెడ్ బాల్ క్రికెట్‌లో పూర్వవైభవం సాధించాల్సి ఉంది. బోర్డు మద్దతు పూర్తిగా ఉండటంతో గంభీర్ ఎలాంటి భయం లేకుండా జట్టును విజయం వైపు నడిపించే వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Gautam Gambhir Test Coaching: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు టెస్టు ఫార్మాట్‌లో మాత్రం తీవ్రంగా విఫలమవుతున్నాడు. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న గంభీర్ భవితవ్యంపై బీసీసీఐ నుంచి కొన్ని కీలక సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచి మొదలయ్యే శ్రీలంక టెస్టు సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోతే గంభీర్ పదవికి ముప్పు ఉన్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. కానీ, ఆ తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది..
బీసీసీఐ పూర్తి మద్దతు.. గంభీర్‌కు ఊరట..
గత ఎనిమిది నెలలుగా టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న భారత క్రికెట్ జట్టు త్వరలోనే శ్రీలంక పర్యటనతో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ బరిలోకి దిగుతోంది. ఇటీవల కాలంలో టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఓటముల తర్వాత గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ తరుణంలో బీసీసీఐ అతనికి పూర్తి అభయం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జట్టులో మార్పుల కాలం.. ఆ విమర్శల్లో నిజం లేదా?
జట్టు ప్రస్తుతం మార్పుల దశ నుంచి వెళ్తోందనే విషయాన్ని క్రికెట్ బోర్డు గుర్తించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు హఠాత్తుగా టెస్టులకు వీడ్కోలు పలకడం, దానికి తోడు ఆటగాళ్లను గాయాలు వేధించడం జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. ఇటువంటి క్లిష్ట సమయంలో కొత్త జట్టును తీర్చిదిద్దడానికి కోచ్‌గా గంభీర్‌కు మరింత సమయం ఇవ్వడమే సరైన మార్గమని బీసీసీఐ భావిస్తోంది. అతను స్వయంగా తప్పుకుంటే తప్ప, శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఓడిపోయినా అతడిని తొలగించే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది.
టెస్టుల్లో నిరాశ.. వైట్ బాల్‌లో తిరుగులేని ఆధిపత్యం..
గంభీర్ బాధ్యతలు స్వీకరించిన 14 నెలల కాలంలో టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత విజయాలు సాధించింది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2027 వన్డే ప్రపంచకప్ వరకు పరిమిత ఓవర్ల కోచ్‌గా గంభీర్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, టెస్టుల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాలు ఎదురవడం, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ వెనుకబడింది.
గాయాల సమస్యల నుంచి కోలుకునేనా?
భారత జట్టును గత కొద్దికాలంగా గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా శ్రీలంకతో జరగబోయే కీలక సిరీస్‌కు దూరమయ్యారు. రాబోయే లంక పర్యటన గంభీర్‌కు, కుర్రాళ్లతో కూడిన టీమిండియాకు విమర్శకుల నోళ్లు మూయించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




