AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు తెలిస్తే..

కంటి రెప్ప మూసి తెరిచేలోపు మాయం.. చూస్తుండగానే రంగు, రూపు మార్చేసే అద్భుతం.. సముద్రపు లోతుల్లో తిరిగే ఈ జీవి గ్రహాంతర వాసా అనేలా శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తున్న సముద్రపు మాయగాడు ఆక్టోపస్ అంతుచిక్కని రహస్యాల గురించి చాలా మందికి తెలియదు. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు తెలిస్తే..
How Octopuses Disappear In Milliseconds
Krishna S
|

Updated on: Sep 27, 2026 | 4:07 PM

Share

సముద్రపు లోతుల్లో జీవించే ఆక్టోపస్ తన అద్భుతమైన మాయాజాలంతో ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుటుంది. పరిసరాలకు తగ్గట్టుగా కంటి రెప్పపాటులో రంగు, ఆకారాన్ని మార్చుకుంటూ కళ్లముందే మాయమైపోయే దీని నైపుణ్యం సామాన్యులకే కాక, దశాబ్దాలుగా సముద్ర జీవులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకూ అంతుచిక్కని అద్భుతంగా మారింది. ఆక్టోపస్ చర్మంలో ఉండే క్రోమాటోఫోర్స్ అనే ప్రత్యేక కణాలు కేవలం మిల్లీసెకన్ల వ్యవధిలోనే దాని చర్మపు రంగును, కాంట్రాస్ట్‌ను పూర్తిగా మార్చేస్తాయి. సముద్రపు ఇసుక, పగడపు దిబ్బలు లేదా సూర్యకాంతి పడే బండరాళ్ల రంగులను ఇది అచ్చుగుద్దినట్లు దించేస్తుంది. రంగు మార్చడమే కాకుండా చర్మం కింద ఉండే కండరాల సాయంతో శరీర ఉపరితలాన్ని గరుకుగా, బుడిపెలుగా మార్చుకుని ఒక రాయిలాగో లేదా సముద్రపు మొక్కలాగో భ్రమింపజేసి వేటాడే జీవుల కళ్లుగప్పుతుంది.

ఈ వేగవంతమైన మార్పుకు దాని విలక్షణ నాడీ వ్యవస్థే కారణం. సాధారణంగా జంతువుల్లో రంగు మారే ప్రక్రియ హార్మోన్ల వల్ల నెమ్మదిగా జరిగితే, ఆక్టోపస్‌లో నరాలు నేరుగా చర్మ కణాలను క్షణాల్లో నియంత్రిస్తాయి. మరీ ముఖ్యంగా ఆక్టోపస్ శరీరంలోని న్యూరాన్లలో సగానికి పైగా దాని తలలో కాకుండా ఎనిమిది చేతుల్లోనే ఉంటాయి. దీనివల్ల ప్రతి చేయి మెదడు ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా స్పర్శను గ్రహిస్తూ, వస్తువులను పట్టుకుంటూ ఒక గ్రహాంతర జీవి తరహాలో ఏకకాలంలో ఆలోచించగలదు.

ఆక్టోపస్‌ల తెలివితేటలు క్షీరదాలకు దీటుగా ఉంటాయి. ఇవి పజిల్స్ ఛేదించడం, మూతలు బిగించిన డబ్బాలను తెరవడం, గత అనుభవాల ద్వారా విషయాలను గుర్తుపెట్టుకోవడం వంటి అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలను వేధిస్తున్న అతిపెద్ద చిక్కుముడి ఏమిటంటే.. ఆక్టోపస్‌లకు రంగులను గుర్తించే దృష్టి సామర్థ్యం చాలా పరిమితం. మరి సరిగ్గా రంగులను చూడలేని ఈ జీవి, చుట్టూ ఉన్న పరిసరాల రంగులను అంత ఖచ్చితంగా ఎలా అనుకరిస్తుందనేది ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది. మేధస్సు, అనుకూలతలకు సరికొత్త అర్థం చెబుతూ ఆక్టోపస్ సముద్రపు రహస్యాలలో ఒకటిగా నిలుస్తోంది.

Follow Us