పశ్చిమ బెంగాల్లోని హౌరా ప్రాంతంలో ఓ విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హ్యాపీ గార్డెన్ అనే అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విధంగా నగదు, బంగారాన్ని వదిలేసి బ్రాండెడ్ షూలను ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దొంగతనం హౌరాలోని హ్యాపీ గార్డెన్ అపార్ట్మెంట్లో జరిగింది. దొంగ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత, ఏకంగా 40 ఫ్లాట్ల వెలుపల ఉంచిన ఖరీదైన బ్రాండెడ్ షూస్, చెప్పులను ఒక పెద్ద బ్యాగులో నింపుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దొంగతనానికి వచ్చినప్పుడు అతను చాలా నీట్గా వైట్ షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడు, కానీ అతని కాళ్లకు మాత్రం చెప్పులు లేవు. అపార్ట్మెంట్ వాసుల అంచనా ప్రకారం, దొంగ ఎత్తుకెళ్లిన షూస్, చెప్పుల విలువ దాదాపు లక్షా 20 వేల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ దొంగతనం దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి, చర్చకు దారితీసింది. పోలీసులు ఈ వింత దొంగతనం కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు.