AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు లేకున్నా ఆగని అడుగులు.. ఓటు వేసేందుకు 13 కిలో మీటర్లు నడిచిన గిరిజనులు

సిటీలో ఉన్న జనాలకు సకల సౌకర్యాలు ఉన్నా.. ఓటు వేయడం తమ బాధ్యత అయినా.. దానిపై చాలామంది ఆసక్తి చూపించరు. మనకెందుకులే అనుకొని ఇంట్లో కూర్చొని ప్రభుత్వం ఇచ్చిన సెలవును ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడో గ్రామస్థులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోయినా.. 13 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చాటిచెప్పారు

రోడ్డు లేకున్నా ఆగని అడుగులు.. ఓటు వేసేందుకు 13 కిలో మీటర్లు నడిచిన గిరిజనులు
Tribal Voters Walk 13 Km To Cast Their Votes
Anand T
|

Updated on: Nov 29, 2026 | 12:44 PM

Share

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను చాటిచెప్పారు అల్లూరి జిల్లా గిరిజనులు.తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏకంగా 13 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓటు వేయాలనే పట్టుదలతో ముందుకు సాగి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల, బూరిగ గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ సాహసయాత్ర చేశారు.ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు 120 మంది ఓటర్లు ఉన్నారు.అయితే వీరు ఓటు వేయాలంటే పంచాయతీ కేంద్రం రొంపిల్లికి చేరుకోవాల్సి ఉంటుంది.గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కాలిబాటన 13 కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

ఎన్నో ఏళ్లుగా తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, తమ భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నామని గిరిజనులు చెబుతున్నారు.తమ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ముఖ్యమని భావించి ఇన్ని కష్టాలు ఎదురైనా ఓటు వేయడానికి వచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ గిరిజనులు 13 కిలోమీటర్లు నడిచి ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహదారి సౌకర్యం లేకపోయినా ఓటు హక్కును వినియోగించుకున్న వారి పట్టుదల, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us