AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరసం, బలహీనతతో బాధపడుతున్నారా? మటన్ కీమా ఇలా చేసుకోండి.. అదిరిపోయే రుచి.. ఆరోగ్యం!

మటన్‌ కీమాలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగుంటాయి.. మటన్ కీమా మసాలా కర్రీని ప్రెషర్ కుక్కర్‌లో చాలా ఈజీగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి, నాలుగు టేబుల్‌స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత, సన్నగా తరిగిన నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంతవరకు వేగనివ్వాలి.

నీరసం, బలహీనతతో బాధపడుతున్నారా? మటన్ కీమా ఇలా చేసుకోండి.. అదిరిపోయే రుచి.. ఆరోగ్యం!
Mutton Keema Recipe
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2026 | 12:09 PM

Share

అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా.. నీరసం, బలహీనతతో బాధపడుతున్నా.. చాలామంది మటన్ కీమా తినమని చెబుతుంటారు.. ఎందుకంటే.. మటన్ లోని పోషకాలు శరీరాన్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. నమలడానికి ఈజీగా.. త్వరగా జీర్ణమయ్యేలా మటన్ కీమా సహాయపడుతుంది. మటన్ కీమాలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి కండరాల బలానికి, రక్తహీనత నివారణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. ఇందులోని పోషకాల వల్ల శరీరం బలంగా మారడంతోపాటు.. నీరసం తగ్గిపోతుంది.. మటన్ కీమా మసాలా కర్రీ అనేది చాలామంది ఇష్టపడే ఒక సంప్రదాయ వంటకం.

అయితే.. చాలా మంది ఆదివారం రోజున మటన్ తెచ్చుకొని తింటారు. కొందరు సాధరణ ముక్కలు కట్ చేయిస్తే.. మరికొందరు మటన్ కీమాగా కట్ చేయించుకుంటారు. అయితే.. మటన్ కీమాను ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి చాలా తక్కువ సమయంలో, అంతే రుచిగా ఎలా తయారుచేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీ కేవలం సులభం మాత్రమే కాదు, చాలా రుచికరంగా కూడా ఉంటుంది.

మటన్ కీమా కర్రీకి కావలసిన పదార్థాలు:

  • మటన్ కీమా:  ముప్పావు కిలో.. నుంచి కిలో
  • ఆయిల్: 4 టేబుల్‌స్పూన్లు
  • ఉల్లిపాయలు: 4 మీడియం సైజు (సన్నగా తరిగినవి)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్‌స్పూన్
  • టమాటో: 1 మీడియం సైజు (సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
  • పసుపు: 1/4 స్పూన్
  • కారం: 3 టేబుల్‌స్పూన్లు
  • ధనియాల పొడి: 2 టేబుల్‌స్పూన్లు
  • ఎండుకొబ్బరి పొడి: 1 స్పూన్
  • జీడిపప్పు పొడి: 1 టేబుల్‌స్పూన్
  • గరం మసాలా: 1 స్పూన్
  • నీళ్లు: 3 గ్లాసులు (కీమా ముదురుగా ఉంటే) లేదా 2 గ్లాసులు (కీమా లేతగా ఉంటే)
  • ఉప్పు: రుచికి సరిపడా
  • కొత్తిమీర: సన్నగా తరిగినది (గార్నిష్ కోసం)

తయారీ విధానం:

ఉల్లిపాయలు వేయించడం: ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి, నాలుగు టేబుల్‌స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత, సన్నగా తరిగిన నాలుగు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంతవరకు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా వేగితేనే కూర రుచిగా ఉంటుంది.

అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చడం: ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత, అందులో ఒక టేబుల్‌స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంతవరకు రెండు నిమిషాల పాటు వేగించాలి. ఇది కూరకు అద్భుతమైన సువాసనను ఇస్తుంది.

కీమా, టమాటో, పసుపు: ఇప్పుడు, ముప్పావు కిలో మటన్ కీమాను కుక్కర్‌లో వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు టమాటో, రెండు పచ్చిమిర్చి, పావు స్పూన్ పసుపు కూడా చేర్చి, అన్నీ బాగా కలిసేలా గరిటతో తిప్పాలి.

కీమా ఉడకనివ్వడం: కీమాను మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. కొద్దిసేపటికి మటన్ కీమా నుండి నీరు బయటికి వస్తుంది. ఈ నీరంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు కీమాను ఉడికించాలి. ఈ ప్రక్రియ కీమాలోని పచ్చిదనాన్ని తొలగించి, రుచిని మెరుగుపరుస్తుంది.

మసాలాలు చేర్చడం: కీమాలోని నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత, మూడు టేబుల్‌స్పూన్ల కారం, రెండు టేబుల్‌స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూన్ ఎండుకొబ్బరి పొడి, ఒక టేబుల్‌స్పూన్ జీడిపప్పు పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి, అన్ని మసాలాలు కీమాకు పట్టేలా రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి.

నీళ్లు పోసి విజిల్స్ రప్పించడం: ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. కీమా కొంచెం ముదురుగా ఉంటే మూడు గ్లాసుల నీళ్లు, లేతగా ఉంటే రెండు గ్లాసుల నీళ్లు సరిపోతాయి. బాగా కలిపి, కుక్కర్ మూత పెట్టేసి, పది విజిల్స్ రానివ్వాలి. (లేత కీమా అయితే ఐదు నుంచి ఆరు విజిల్స్ సరిపోతాయి).

ఉప్పు చేర్చడం, దగ్గర పడనివ్వడం: ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. ఈ దశలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సాధారణంగా, ముదురు కీమాకు ముందుగా ఉప్పు వేస్తే సరిగ్గా ఉడకదు, అందుకే చివరగా చేర్చడం మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, గ్రేవీ దగ్గర పడి, ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించాలి.

గ్రేవీ చక్కగా దగ్గరపడి, ఆయిల్ పైకి తేలిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి, స్టవ్ ఆపేయాలి.

ఇప్పుడు, ఎంతో రుచికరమైన మటన్ కీమా మసాలా కర్రీ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిని వేడి వేడి అన్నం, రోటీ, పుల్కా లేదా నాన్‌తో ఆస్వాదించవచ్చు. ఈ సులభమైన విధానంతో మీరు ఇంట్లోనే అద్భుతమైన కీమా కర్రీని తయారు చేసుకోవచ్చు.

Follow Us