ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంక్ రుణాల కోసం వెతుకుతూ ఉంటారు. ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది పర్సనల్ లోన్. ఎందుకంటే దీనికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు.
అయితే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో మీరు ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసి ఉంటే.. దానిపై రుణం తీసుకోవడం మంచి ఎంపిక.
చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలను అందిస్తున్నాయి. ఈ రెండూ రుణాల మధ్య అనేక తేడాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు కూడా భిన్నంగా ఉంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ పూచీకత్తుగా పనిచేస్తుంది కాబట్టి బ్యాంకులకు నష్టభయం తక్కువగా ఉంటుంది. దీంతో FDపై తీసుకునే రుణానికి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి.
FDపై రుణం తీసుకోవడం అనేది చాలా సులభం. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇప్పటికే బ్యాంకు ఆధీనంలో ఉంటుంది కాబట్టి రుణం త్వరగా మంజూరు అవుతుంది. అలాగే పెద్దగా డాక్యుమెంట్ల అసవరం కూడా ఉండదు.
ఇక రుణం తీసుకోవడానికి FDని రద్దు చేయాల్సి వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ ఆ అవసరం అనేది ఉండదు. మీ FD డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది.
ఇక FDని గడువుకు ముందే రద్దు చేయడం వల్ల బ్యాంకు నిబంధనలను బట్టి తక్కువ వడ్డీ రాబడి లేదా గడువుకు ముందే డబ్బు విత్‌డ్రా చేసినందుకు జరిమానా విధించబడవచ్చు.
ఎఫ్‌డీపై తీసుకునే రుణం కంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమైతే పర్సనల్ లోన్ ఎంచుకోవచ్చు. పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ లేనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలి.
అవసరమైన మొత్తంలో మాత్రం రుణం తీసుకోండి. ఎక్కువ తీసుకోడం వల్ల దీర్ఘకాలంలో భారం పడవచ్చు. వడ్డీ కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.