Marriage Astrology: గురు, శుక్రుల పరివర్తన.. వైశాఖ, శ్రావణ మాసాల్లో ఈ రాశుల వారికి పెళ్లి గ్యారంటీ..!
గురు, శుక్ర గ్రహాల అనుకూల స్థితి, శని మార్చి 29న మీనరాశి ప్రవేశం వల్ల ఉగాది తర్వాత కొన్ని రాశుల వారికి వివాహం జరిగే అవకాశం ఎక్కువ. జ్యోతిష్య శాస్త్ర అంచనాల మేరకు వైశాఖం లేదా శ్రావణ మాసాలలో ఈ రాశులవారికి శుభకార్యాలు జరుగే అవకాశముంది. ప్రేమ వివాహాలు, సంప్రదాయ వివాహాలు రెండూ సాధ్యం. పెళ్లి ఖర్చులు అధికంగా ఉండవచ్చు.

Marriage Astrology 2025
Marriage Predictions: ముఖ్యమైన శుభ గ్రహాలైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం, శుక్రుడు ఉచ్ఛ రాశిలో మే 31వరకూ కొనసాగడం, మార్చి 29 తర్వాత ఉగాది రోజున శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశించడం వంటి కారణాల వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రేమలు, పెళ్లిళ్లకు శుక్రుడు కారకుడు కాగా, శుభ కార్యాలకు గురువు కారకుడు. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర, కుంభ రాశులకు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశుల వారికి వైశాఖ మాసంలో గానీ, శ్రావణ మాసంలో గానీ తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది.
- వృషభం: రాశ్యధిపతి, కళత్ర కారకుడు అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వీరు ఉగాది తర్వాత నుంచి పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేయడం చాలా మంచిది. ఉగాది తర్వాత వీరికి పెళ్లి ప్రయత్నాలు సాగించే పక్షంలో ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు కొనసాగే వైశాఖ మాసంలో వీరికి వివాహం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా బంధువర్గంలో గానీ, ఇష్టపడిన వ్యక్తితో గానీ పెళ్లి నిశ్చయం అవుతుంది. పెళ్లి ఆర్భాటంగా, సంప్రదాయబద్ధంగా జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి కళత్రకారకుడు శుక్రుడు భాగ్య స్థానంలో, శుభ కార్యాలకు కారకుడైన గురువు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, సహోద్యోగితో గానీ పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది. ఈ రాశివారికి ఏప్రిల్ 28 తర్వాత మే 27 లోపల వైశాఖ మాసంలో పెళ్లి అయ్యే సూచనలున్నాయి. ఈ రాశివారి పెళ్లి మీద భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో గానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఉగాది తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. జూలై 25న ప్రారంభమై, ఆగస్టు 23తో ముగిసే శ్రావణ మాసంలో వీరి పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. పెళ్లి బాగా ఆడంబరంగా జరిగే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో కళత్రకారకుడు, సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టి ఉండడం, సప్తమ స్థానంలో గురువు ఉన్నందువల్ల సాధారణంగా ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. బంధువర్గంలో గానీ, పరిచయస్థుల్లో గానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఉగాది తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ రాశివారికి ఏప్రిల్ 28-మే 27 మధ్య కాలంలో తప్పకుండా వివాహం జరుగుతుంది. పెళ్లి కార్యక్రమం నిరాడంబరంగా జరిగిపోయే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల అతి తక్కువ ప్రయత్నంతో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పరిచయస్థులతో గానీ, ఇరుగు పొరుగున ఉండే కుటుంబంతో గానీ పెళ్లి సంబంధం ముడిపడే సూచనలున్నాయి. ఈ రాశివారికి సాధారణంగా జూలై 25-ఆగస్టు 23 మధ్య శ్రావణ మాసంలో పెళ్లి జరగవచ్చు. పెళ్లి వ్యవహారం మీద భారీగా ఖర్చయే సూచనలు కనిపిస్తున్నాయి.
- కుంభం: ఈ రాశివారికి ఉగాది తర్వాత తప్పకుండా వివాహమయ్యే అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టి ఉండడంతోపాటు, గురువుతో పరివర్తన చెందినందువల్ల ఈ రాశివారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇరుగు పొరుగున ఉండే కుటుంబంతో గానీ, బాగా దగ్గర బంధువులతో గానీ పెళ్లి ఖాయమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సాధారణంగా వైశాఖ మాసంలో వీరికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా పెళ్లి జరుగుతుంది.