AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
AP Inter exam 2026 begins today: ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఈ రోజు (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు..

విజయవాడ, ఫిబ్రవరి 23: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఈ రోజు (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 5,31,275 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 5,26,264 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 1,02,000 విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు 150 కి పైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
విద్యార్థులు కనీసం ఒక గంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 2025లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం (సుమారు 90% పైగా) నమోదైంది.పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్ సహా ఎలాంటి గాడ్జెట్ లకు చోటు లేదు. ప్రతి కేంద్రం వద్ద సిసి కెమెరాల నిఘా, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎండలు మొదలు కావడంతో ప్రతి కేంద్రంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యాలు అధికారులు కల్పించారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా 56 వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్ష రాస్తుండగా, 46 వేల మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్ష రాస్తున్నారు. ఏదైనా సమస్యలకు 1800 425 1531 నెంబర్ ను సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్ధులకు సూచనలు జారీ చేశారు. మరోవైపు పరీక్షల పర్యవేక్షణకు ప్రతి కేంద్రం వద్ద ఒక అబ్జర్వర్‌ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిటింగ్ స్క్వాడ్‌లు, ఇతరచోట్ల ఫ్లయింగ్ స్వ్వాడ్‌ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్‌ఐవో, ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటిని అనుసంధానం చేశారు. ఇక సోమవారం మొదలయ్యే పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




