AP EAPCET 2026 కౌన్సెలింగ్ తొలి విడతలో లక్షకు పైగా సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీలదే జోరు
ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ లక్ష దాటుతుండగా.. ఈ ఏడాది తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ కావడం విశేషం...

అమరావతి, ఆగస్ట్ 11: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ లక్ష దాటుతుండగా.. ఈ ఏడాది తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ కావడం విశేషం. ఈఏపీసెట్‌లో ఈ ఏడాది 1,74,802 మంది అర్హత సాధించారు. వీరిలో 1,13,488 మంది ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 1,12,285 మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. వీరు తమకు నచ్చిన బ్రాంచీలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కలిపి మొత్తం 239 విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా కింద 1,51,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో వీటిలో 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 44,073 సీట్లు మిగిలిపోయాయి. ఇక క్రీడా కోటాలోని 666 సీట్లను ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. క్రీడా సర్టిఫికెట్లకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందకపోవడంతో ఈ సీట్ల భర్తీని నిలిపివేశారు. ఇంజినీరింగ్ ప్రవేశాల్లో విద్యార్థులు ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మొత్తం 14,567 సీట్లు ఉండగా.. వాటిలో సుమారు 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కలిపి 9,347 సీట్లు అందుబాటులో ఉండగా.. వీటిలో 87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
రెండేళ్లుగా లక్ష దాటుతున్న భర్తీ
కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ గత రెండేళ్లుగా లక్ష దాటుతోంది. ఈ ఏడాది కూడా తొలి విడతలోనే 1.07 లక్షలకుపైగా సీట్లు భర్తీ కావడంతో ఇంజినీరింగ్ విద్యపై విద్యార్థుల ఆసక్తి కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. తొలి విడతలో మిగిలిన సీట్ల భర్తీకి తదుపరి దశ కౌన్సెలింగ్ కీలకం కానుంది.




