AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: ఇతరులతో ఎలా మాట్లాడాలి? పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించే అద్భుతమైన కథ!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మర్యాదగా మాట్లాడటం, ఇతరులను గౌరవించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. మంచి మాట మనకు మంచి స్నేహితులను, గౌరవాన్ని, సహాయాన్ని అందిస్తుంది. మనిషి ఇతరులతో ఎలా మాట్లాడతాడో, ఇతరులు కూడా అతనితో అలాగే ప్రవర్తిస్తారు. మన మాటల్లో మర్యాద, గౌరవం, ప్రేమ, వినయం ఉంటే ఎదుటివారు మనల్ని ఇష్టపడతారు. మనకు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ముందుకు వస్తారు..

Moral Story: ఇతరులతో ఎలా మాట్లాడాలి? పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించే అద్భుతమైన కథ!
Heartwarming Story For Children
Srilakshmi C
|

Updated on: Nov 19, 2026 | 11:54 AM

Share

అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవి పేరు గంభీరవనం. ఆ అడవిలో ఎన్నో రకాల చెట్లు, పచ్చని పొదలు, అందమైన పూల మొక్కలు ఉండేవి. ఎత్తైన చెట్లపై రంగురంగుల పక్షులు గూళ్లు కట్టుకుని నివసించేవి. జింకలు, కుందేళ్లు, కోతులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, నక్కలు వంటి ఎన్నో జంతువులు ఆ అడవిలో కలిసి మెలిసి జీవించేవి. ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ, ఆనందంగా రోజులు గడిపేవి. అదే అడవిలో లంబు అనే ఒక గాడిద ఉండేది. లంబు బలంగా ఉండేది. రోజంతా అడవిలో తిరుగుతూ ఆహారం వెతుక్కునేది. అయితే దానికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఎవరితోనైనా మర్యాద లేకుండా మాట్లాడటం, చిన్న విషయాలకే కోపంతో గట్టిగా అరవడం, ఇతరులను అవమానించడం దానికి అలవాటుగా మారిపోయింది. తన మాటే అందరూ వినాలని, తనను చూసి అందరూ భయపడాలని అనుకునేది. ఒకరోజు ఉదయం లంబు నిద్రలేచి అడవిలోకి బయలుదేరింది. దారిలో ఒక చెట్టు కొమ్మపై అందంగా కూర్చున్న చిలుక కనిపించింది. చిలుక తన మధురమైన స్వరంతో పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉంది. అది చూసిన లంబు ఒక్కసారిగా గట్టిగా అరిచింది.

‘ఏయ్ చిలుకా! నీ ముక్కు వంకరగా ఉంది. నీ రూపం కూడా నాకు నచ్చలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో!’ లంబు మాటలు విన్న చిలుక బాధపడింది. ‘అయ్యో లంబు! నన్ను ఎందుకు అలా తిడుతున్నావు? నేను నీకు ఏమైనా అపకారం చేశానా? నా పని నేను చేసుకుంటూ ఇక్కడ కూర్చున్నాను కదా!’ అని ప్రశ్నించింది. ‘నోరుమూయ్! నేను అరిస్తే ఈ అడవంతా భయపడిపోవాలి. నా మాటకు ఎదురుచెప్పే ధైర్యం ఎవరికీ ఉండకూడదు!’ అని లంబు మరింత గట్టిగా అరిచింది. అక్కడే ఉన్న ఒక చిన్న పక్షి ఈ మాటలు విని నవ్వుతూ, ‘అబ్బో! వచ్చిందిరా నాయనా అరుపుల బాంబు! అంతగా అరవకు. అరిచి అరిచి నీ గొంతు నొప్పి పుడుతుంది. అందరినీ భయపెట్టడం గొప్ప విషయం కాదు. మంచిగా మాట్లాడటం నేర్చుకో!’ అని చెప్పింది. ఆ మాటలకు లంబుకు మరింత కోపం వచ్చింది.

‘నన్నే అంటావా? ఇంకోసారి నాతో అలా మాట్లాడితే నీ తోక విరిచి చేతిలో పెడతాను. జాగ్రత్త!’ అని బెదిరించింది. అక్కడి నుంచి కోపంగా ముందుకు వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లాక ఒక చిన్న ఉడత చెట్టు కింద కూర్చుని జామపండు తింటూ కనిపించింది. ఆ జామపండు చాలా తాజాగా, ఎర్రగా, తియ్యగా కనిపించింది. దాన్ని చూడగానే లంబుకు ఆకలి వేసింది. వెంటనే ఉడత దగ్గరకు వెళ్లి ‘రేయ్ చిన్న ఉడతా! ఆ జామపండును కింద పెట్టు. నాకు ఆకలిగా ఉంది. నేను తినాలి. వెంటనే ఇవ్వు!’ అని ఆజ్ఞాపించింది. ఉడత భయపడుతూ ‘లంబు అన్నా! ఇది నా జామపండు. నేను చాలా దూరం వెళ్లి కష్టపడి తెచ్చుకున్నాను. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. దయచేసి నన్ను తిననివ్వు’ అని వేడుకుంది. కానీ లంబు వినిపించుకోలేదు. ‘ఇస్తావా లేదా? ఇవ్వకపోతే నిన్ను నా కాలితో తొక్కి పడేస్తాను!’ అని బెదిరించింది.

ఇవి కూడా చదవండి

ఆ మాటలు విన్న ఉడత భయంతో వణికిపోయింది. ‘అయ్యో! నన్ను ఏమీ చేయకు లంబు అన్నా. ఇదిగో, ఈ పండు తీసుకో’ అని తన జామపండును లంబుకు ఇచ్చింది. లంబు ఆ పండును లాక్కొని ఒక్క క్షణంలో తినేసింది. కనీసం ఉడతకు ధన్యవాదాలు కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద చెట్టు కింద భల్లూకం అనే ఎలుగుబంటి కూర్చుని తియ్యటి తేనె తింటోంది. దాని పక్కనే తేనెతో నిండిన ఒక కుండ ఉంది. తేనె రుచి చూసుకుంటూ భల్లూకం ఎంతో ఆనందంగా ఉంది. తేనెను చూసిన లంబుకు మళ్లీ ఆకలి వేసింది. వెంటనే ఎలుగుబంటి దగ్గరకు వెళ్లింది. ‘తియ్యని తేనె… నా ఇష్టమైన తేనె… నా పొట్ట నింపే తియ్యటి తేనె!’ అంటూ పాట పాడుతూ దాని దగ్గరకు చేరుకుంది. తర్వాత ఒక్కసారిగా గట్టిగా అరిచింది.

‘రేయ్ ఎలుగుబంటీ! ఆ పాటలు ఆపి తేనె కుండను ఇటు పడేయ్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ తేనె మొత్తం నేను తినాలి!’ లంబు మాట్లాడిన తీరు ఎలుగుబంటికి నచ్చలేదు. ‘ఏమిటి? రేయ్ ఎలుగుబంటీ అంటావా? మర్యాదగా అడిగి ఉంటే కొంచెం తేనె ఇచ్చేవాడిని. కానీ నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అందుకే తేనె ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపో!’ అని చెప్పింది. అయినా లంబు తన తప్పును తెలుసుకోలేదు. ‘ఇవ్వవా? నేను ఎవరో తెలుసా? నా పేరు లంబు. నేను చెప్పింది చేయకపోతే నిన్ను నా వెనుక కాళ్లతో తంతాను!’ అని బెదిరించింది. ఎలుగుబంటికి చాలా కోపం వచ్చింది. ‘ఏమిటి? నన్నే తంతావా? నీ పొగరు ఈరోజే అణిచేస్తాను. మర్యాద లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది!’ అంటూ లంబు వైపు వేగంగా పరిగెత్తింది. అది చూసిన లంబు భయంతో వణికిపోయింది. ‘అయ్యో అమ్మో! కాపాడండి! ఈ ఎలుగుబంటి నన్ను కొట్టడానికి వస్తోంది!’ అంటూ అక్కడి నుంచి పరుగెత్తింది. ‘ఆగు గాడిదా! ఈరోజు నీకు బుద్ధి చెబుతాను!’ అంటూ ఎలుగుబంటి వెంబడించింది.

లంబు వేగంగా పరిగెత్తి ఒక పెద్ద పొదలో దాక్కుంది. ఎలుగుబంటి కొంతసేపు వెతికింది. కానీ లంబు కనిపించకపోవడంతో విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడే చింటి అనే కోతి అక్కడికి వచ్చింది. ‘ఏమైంది లంబు బావా? ఎందుకలా పొదల్లో దాక్కున్నావు? ఏదైనా ప్రమాదం జరిగిందా?’ అని అడిగింది. లంబు బయటకు వచ్చి జరిగిన విషయమంతా చెప్పింది. ‘ఆ ఎలుగుబంటికి ఎంత పొగరు! కొంచెం తేనె అడిగితే ఇవ్వకుండా నన్ను కొట్టడానికి వచ్చింది. నన్నే బెదిరిస్తుందా? దాని సంగతి చెబుతాను!’ అని కోపంగా అంది. చింటి కోతి నవ్వుతూ ‘లంబు బావా! నువ్వు మంచిగా అడిగి ఉంటే ఎలుగుబంటి తప్పకుండా తేనె ఇచ్చేది. కానీ నువ్వు దానితో మర్యాద లేకుండా మాట్లాడావు. అందుకే అది కోపపడింది. అందరినీ బెదిరిస్తే ఎవరూ నీకు సహాయం చేయరు కదా!’ అని సలహా ఇచ్చింది. అయినా లంబు ఆ మాటలను పట్టించుకోలేదు. ‘పోరా కోతీ! నువ్వు కూడా నాకు నీతులు చెప్పకు. నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను!’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లిన లంబుకు బాగా అలసట వచ్చింది. ఆకలి కూడా ఎక్కువైంది. ఒక పెద్ద రాయి మీద కూర్చుని దిగులుగా ఆలోచిస్తోంది. అదే సమయంలో జంబూకం అనే ఒక జిత్తులమారి నక్క అక్కడికి వచ్చింది. అది చాలా తెలివైనదే కానీ ఇతరులను మోసం చేసి తన పనులు చేయించుకోవడం దానికి అలవాటు.

లంబును చూసిన నక్క దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడింది. ‘అయ్యో! నా ముద్దుల లంబు అన్నయ్యా! ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? నీ ముఖం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎవరు నిన్ను బాధపెట్టారు?’ అని అడిగింది. లంబు తన బాధను చెప్పుకుంది. ‘జంబూ! నాకు చాలా ఆకలిగా ఉంది. ఎలుగుబంటి దగ్గర తేనె అడిగితే ఇవ్వలేదు. పైగా నన్ను కొట్టడానికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు’ అని చెప్పింది. నక్క వెంటనే తన మాటలతో లంబును మభ్యపెట్టడం మొదలుపెట్టింది. ‘అయ్యో అన్నయ్యా! నీ తప్పేమీ లేదు. నీ గొంతులో ఎంత శక్తి ఉందో ఆ ఎలుగుబంటికి తెలియదు. నువ్వు ఒక్కసారి గట్టిగా అరిస్తే అడవిలోని జంతువులన్నీ భయపడిపోతాయి. నీ గొంతు వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!’ అని పొగిడింది. లంబు ఆ మాటలు విని సంతోషపడింది. ‘అవునా జంబూ? నా గొంతులో అంత శక్తి ఉందా?’ అని అడిగింది. ‘అవును అన్నయ్యా! నీకు ఒక మంచి విషయం చెబుతాను. ఆ కొండ వెనుక పెద్ద మామిడి తోట ఉంది. అక్కడ ఎన్నో తియ్యటి మామిడిపండ్లు ఉన్నాయి. ఆ తోటకు గజరాజు అనే పెద్ద ఏనుగు కాపలాగా ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్లి గట్టిగా అరిచి బెదిరిస్తే పండ్లన్నీ నీకు ఇచ్చేస్తుంది. నువ్వు కొన్ని పండ్లు తింటే చాలు. నాకు కూడా ఒకటి రెండు ఇస్తే సరిపోతుంది’ అని చెప్పింది. నక్క మాటలు విన్న లంబు చాలా సంతోషించింది.

‘ఆహా! ఎంత మంచి ఆలోచన చెప్పావు జంబూ! ఇప్పుడే వెళ్లి ఆ ఏనుగును భయపెట్టి మామిడిపండ్లన్నీ తీసుకొస్తాను!’ అని చెప్పి మామిడి తోట వైపు బయలుదేరింది. నక్క మాత్రం లంబు వెళ్తుండగా దొంగచూపులు చూస్తూ నవ్వుకుంది. ‘హహహ! ఈ గాడిదను బాగా మోసం చేశాను. అది ఏనుగు దగ్గర దెబ్బలు తింటుంది. నేను మాత్రం ఏదో ఒక మార్గంలో పండ్లు దొంగిలిస్తాను!’ అని అనుకుంది. మరోవైపు లంబు మామిడి తోటకు చేరుకుంది. అక్కడ గజరాజు అనే పెద్ద ఏనుగు చెట్లను జాగ్రత్తగా చూసుకుంటూ తోటను కాపాడుతోంది. లంబు ఏ మాత్రం మర్యాద లేకుండా ఏనుగు దగ్గరకు వెళ్లి ‘రేయ్ ముసలి ఏనుగూ! ఆ చెట్ల మీద ఉన్న మామిడిపండ్లన్నీ వెంటనే కింద పడేయ్. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను అన్నీ తినాలి!’ అని అరిచింది. గజరాజు ఆశ్చర్యంగా లంబును చూసింది. ‘ఎవరు నువ్వు? చిన్న గాడిదవై ఉండి ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? నీకు పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలియదా?’ అని ప్రశ్నించింది. లంబు తన అలవాటును మార్చుకోలేదు. ‘నేను లంబును. నా పేరు వింటే అందరూ భయపడాలి. పండ్లు కింద పడేయకపోతే నీ తోట అంతా నాశనం చేస్తాను!’ అని బెదిరించింది. గజరాజుకు కోపం వచ్చింది.

‘మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. పండ్లు కావాలంటే మంచిగా అడుగు. ఇలా బెదిరిస్తే నీకు పండ్లు కాదు, దెబ్బలు మాత్రమే దక్కుతాయి!’ అని హెచ్చరించింది. అయినా లంబు వినలేదు. ‘నాకే బుద్ధి చెబుతావా? నీ సంగతి చూస్తాను!’ అంటూ మరింత గట్టిగా అరిచింది. అప్పుడు గజరాజు తన తొండంతో పక్కనే ఉన్న నీటి తొట్టెలో నుంచి నీటిని పీల్చుకుంది. ఒక్కసారిగా లంబు ముఖంపై బలంగా నీటిని చిమ్మింది. ఆ నీటి దెబ్బకు లంబు వెనక్కి తూలి కొద్దిదూరంలో ఉన్న బురదలో పడిపోయింది. ‘అయ్యో అమ్మో! నా ఒళ్లంతా బురద అయిపోయింది. కాపాడండి! కాపాడండి!’ అంటూ లంబు అరిచింది. సరిగ్గా అదే సమయంలో చింటి కోతి అక్కడికి వచ్చింది. గజరాజును చూసి గౌరవంగా నమస్కరించింది. ‘నమస్కారం గజరాజు తాతయ్యగారూ! మీరు ఎలా ఉన్నారు?’ అని ఎంతో వినయంగా అడిగింది. గజరాజు సంతోషంగా, ‘బాగున్నాను చింటి! నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని అడిగింది.

చింటి కోతి వినయంగా ‘తాతయ్యగారూ! నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు దయచేసి ఒక చిన్న మామిడిపండు ఇస్తారా? మీకు ఇబ్బంది కలగకుండా ఒక పండు మాత్రమే తీసుకుంటాను’ అని అడిగింది. చింటి మాట్లాడిన తీరు గజరాజుకు చాలా నచ్చింది. ‘అబ్బా! ఎంత చక్కగా మాట్లాడావురా చింటి! గౌరవంగా అడిగితే నేను కాదంటానా? ఇదిగో, నీకు కావలసినన్ని పండ్లు తీసుకో!’ అని తన తొండంతో కొన్ని మంచి మామిడిపండ్లను కిందకు దించి ఇచ్చింది. చింటి కోతి ఆనందంతో ‘చాలా ధన్యవాదాలు తాతయ్యగారూ! మీరు ఎంతో మంచివారు. మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను’ అని చెప్పింది. అదంతా బురదలో నుంచి చూస్తున్న లంబుకు ఆశ్చర్యం వేసింది. ‘నేను గట్టిగా అరిచి పండ్లు అడిగితే ఏనుగు నాకు నీళ్లు చిమ్మింది. కానీ చింటి కోతి ఎంతో మర్యాదగా అడిగితే వెంటనే పండ్లు ఇచ్చింది. ఇదేమిటి? ఒకే ఏనుగు ఇద్దరితో రెండు రకాలుగా ఎందుకు ప్రవర్తించింది?’ అని ఆలోచించింది. చింటి కోతి పండ్లు తీసుకుని వెళ్తుండగా లంబు దాని దగ్గరకు వచ్చింది. ‘చింటీ! ఒక విషయం అడగనా? నేను గట్టిగా అరిచి పండ్లు అడిగితే గజరాజు తాతయ్య నన్ను బురదలో పడేశాడు. కానీ నువ్వు మంచిగా అడిగితే పండ్లు ఇచ్చాడు. ఎందుకలా జరిగింది?’ అని అడిగింది.

చింటి కోతి నవ్వుతూ ‘లంబు బావా! మనం ఇతరులతో ఎలా మాట్లాడతామో, వారు కూడా మనతో అలాగే మాట్లాడతారు. నువ్వు ఎవరినైనా అవమానిస్తూ, బెదిరిస్తూ మాట్లాడితే వారు నీకు ఎందుకు సహాయం చేస్తారు? కానీ మనం గౌరవంగా, ప్రేమగా మాట్లాడితే ఎదుటివారు కూడా మనల్ని గౌరవిస్తారు. అవసరమైనప్పుడు సహాయం చేస్తారు’ అని వివరించింది. ఆ మాటలు విన్న లంబు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. ‘అంటే నేను అందరితో తప్పుగా మాట్లాడుతున్నానా? అందుకే ఎవరూ నాకు సహాయం చేయడం లేదా?’ అని బాధగా అడిగింది. ‘అవును బావా! నీకు ఒక విషయం చెబుతాను. కోపంగా అరవడం వల్ల మన సమస్యలు పరిష్కారం కావు. ప్రేమగా మాట్లాడితే కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మన మాటల్లో మర్యాద ఉండాలి. ఎదుటివారి మనసును బాధపెట్టకూడదు’ అని చింటి చెప్పింది. లంబు ఆలోచనలో పడింది. కానీ తనకు ఇంకా ఒక విషయం అర్థం కావాల్సి ఉంది. ఇంతలో మరోవైపు జంబూకం నక్క మామిడి తోట దగ్గరికి చేరుకుంది. లంబు పండ్లు అడగడానికి వెళ్లిన సమయంలో తాను కూడా కొన్ని పండ్లు దొంగిలించాలని అనుకుంది.

నక్క నెమ్మదిగా ఒక చెట్టు దగ్గరకు వెళ్లి పండ్లు కోయడానికి ప్రయత్నించింది. అక్కడే ఒక కొమ్మకు పెద్ద తేనెటీగల గూడు వేలాడుతోంది. నక్కకు అది కనిపించలేదు. పండ్లు కోసే ప్రయత్నంలో ఆ గూడును గట్టిగా కదిలించింది. అంతే! తేనెటీగలన్నీ ఒక్కసారిగా గూడు నుంచి బయటకు వచ్చాయి. నక్కను చుట్టుముట్టి కుట్టడం మొదలుపెట్టాయి. ‘అయ్యో అమ్మో! కాపాడండి! తేనెటీగలు నన్ను కుడుతున్నాయి! నా ప్రాణాలు పోతున్నాయి!’ అంటూ నక్క పరుగులు పెట్టింది. తేనెటీగలు కొంతదూరం వరకు దాని వెంటపడ్డాయి. చివరకు నక్క ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన లంబు ఆశ్చర్యపోయింది. ‘అరే! ఇతరులను మోసం చేసి తనకు కావలసింది తీసుకోవాలనుకున్న నక్కకు కూడా చివరకు కష్టమే వచ్చింది. ఎవరినీ బాధపెట్టకుండా, మర్యాదగా ఉండటమే మంచిదేమో!’ అని అనుకుంది. అప్పుడే తన తప్పులను పూర్తిగా గుర్తించింది. చిలుకను తిట్టడం, ఉడత దగ్గర జామపండును బలవంతంగా తీసుకోవడం, ఎలుగుబంటిని బెదిరించడం, ఏనుగుతో మర్యాద లేకుండా మాట్లాడటం అన్నీ గుర్తుకు వచ్చాయి. ‘అయ్యో! నేను ఎంత పెద్ద తప్పు చేశాను! నా మాటల వల్ల అందరినీ బాధపెట్టాను. ఇకపై ఎవరితోనూ అలా మాట్లాడకూడదు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండాలి’ అని మనసులో నిర్ణయించుకుంది. తర్వాత లంబు మళ్లీ మామిడి తోటలో ఉన్న గజరాజు దగ్గరకు వెళ్లింది. ఈసారి దాని ముఖంలో కోపం లేదు. మాటల్లో అహంకారం లేదు. ఎంతో వినయంగా ఏనుగు దగ్గరకు వెళ్లి నమస్కరించింది. ‘గజరాజు తాతయ్యగారూ! నన్ను క్షమించండి. ఇంతకుముందు మీతో చాలా తప్పుగా మాట్లాడాను. మీ తోటను నాశనం చేస్తానని బెదిరించాను. అలా మాట్లాడటం నా తప్పు. దయచేసి నన్ను క్షమించండి’ అని చెప్పింది.

గజరాజు లంబును చూసి సంతోషించింది. ‘పర్వాలేదు లంబూ! మనిషైనా, జంతువైనా తప్పులు చేయడం సహజం. కానీ చేసిన తప్పును తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు చెప్పు, నీకు ఏం కావాలి?’ అని ప్రేమగా అడిగింది. లంబు వినయంగా ‘తాతయ్యగారూ! నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఒక మామిడిపండు ఇస్తారా?’ అని అడిగింది. గజరాజు ఆనందంగా ‘తప్పకుండా ఇస్తాను లంబూ! నువ్వు ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నావో చూడు. ఇదిగో, నీకు తియ్యటి మామిడిపండు!’ అంటూ తన తొండంతో ఒక మంచి పండును ఇచ్చింది. లంబు ఆ మామిడిపండును తీసుకుని ఆనందంగా తిన్నది. ‘చాలా ధన్యవాదాలు తాతయ్యగారూ! మీరు నాకు ఒక మంచి పాఠం నేర్పించారు. ఇకపై అందరితో మర్యాదగా మాట్లాడతాను’ అని చెప్పింది. అప్పుడు గజరాజు లంబుకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ‘లంబూ! మా పెద్దలు ఎప్పుడూ ఒక మంచి సామెత చెప్పేవారు. అదేంటంటే… నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన మాటలు మంచిగా ఉంటే అందరూ మనల్ని ఇష్టపడతారు. అవసరమైనప్పుడు మనకు సహాయం చేస్తారు. మనం ఇతరులను గౌరవిస్తేనే ఎదుటివారు కూడా మనల్ని గౌరవిస్తారు. అందుకే ఎప్పుడూ ప్రేమగా, వినయంగా, మర్యాదగా మాట్లాడాలి’ అని చెప్పింది. లంబు ఆ మాటలను శ్రద్ధగా విన్నది.

‘తాతయ్యగారూ! మీరు చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇకపై ఎవరినీ తక్కువ చేసి చూడను. ఎవరినీ బెదిరించను. అందరితో మంచిగా మాట్లాడతాను’ అని మాట ఇచ్చింది. గజరాజు సంతోషంగా తల ఊపింది. ‘చాలా మంచిది లంబూ! నువ్వు మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్లు, అందరితో స్నేహంగా ఉండు’ అని ఆశీర్వదించింది. లంబు అక్కడి నుంచి ఆనందంగా బయలుదేరింది. దారిలో ఒక చెట్టు కొమ్మపై చిలుక కనిపించింది. గతంలో తాను దాన్ని ఎంతగా బాధపెట్టిందో లంబుకు గుర్తొచ్చింది. వెంటనే చిలుక దగ్గరకు వెళ్లి ఎంతో ప్రేమగా పలకరించింది. ‘అరే చిలకమ్మా! నమస్కారం! ఎలా ఉన్నావు? ఎటు వెళ్తున్నావు?’ అని అడిగింది. లంబు ఇంత ప్రేమగా మాట్లాడటం చూసి చిలుక ఆశ్చర్యపోయింది. ‘అయ్యో! లంబు అన్నా! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నేను జామతోటకు వెళ్తున్నాను’ అని నవ్వుతూ చెప్పింది. లంబు కూడా నవ్వింది. ‘అవునా చిలకమ్మా! చాలా సంతోషం. జాగ్రత్తగా వెళ్లు. మళ్లీ కలుద్దాం!’ అని చెప్పింది. చిలుక ఎంతో ఆనందంగా ‘తప్పకుండా లంబు అన్నా! నువ్వు ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నావు. నీలో వచ్చిన మార్పు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పి రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. తర్వాత లంబు ఉడతను కలిసింది. గతంలో బలవంతంగా తీసుకున్న జామపండుకు క్షమాపణ చెప్పింది.

‘చిన్న ఉడతా! ఆరోజు నీ జామపండును బలవంతంగా తీసుకున్నాను. నిన్ను చాలా బాధపెట్టాను. నన్ను క్షమించు. ఇకపై అలా చేయను’ అని చెప్పింది. ఉడత సంతోషంగా ‘పర్వాలేదు లంబు అన్నా! నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఇకపై మంచి స్నేహితులుగా ఉందాం’ అని చెప్పింది. ఆ రోజు నుంచి లంబు పూర్తిగా మారిపోయింది. ఎవరినీ తక్కువ చేసి చూడలేదు. చిన్నవారైనా, పెద్దవారైనా అందరినీ గౌరవించేది. ఎవరికైనా సహాయం అవసరమైతే ముందుండి సహాయం చేసేది. కోపం వచ్చినప్పుడు కూడా ఓపికగా ఉండటం నేర్చుకుంది. అడవిలోని జంతువులన్నీ లంబులో వచ్చిన మార్పును గమనించాయి. ఒకప్పుడు లంబు అరుపులకు భయపడే జంతువులు ఇప్పుడు దాని ప్రేమపూర్వకమైన మాటలకు సంతోషించాయి. కొద్దికాలంలోనే లంబుకు అడవిలో మంచి స్నేహితులు ఏర్పడ్డారు. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు కింద సమావేశమయ్యాయి. గజరాజు, భల్లూకం, చింటి కోతి, చిలుక, ఉడత అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు చింటి కోతి లంబును చూపిస్తూ,

‘మిత్రులారా! ఒకప్పుడు లంబు అందరితో కోపంగా, మర్యాద లేకుండా మాట్లాడేది. కానీ ఇప్పుడు తన తప్పును తెలుసుకుని ఎంతో మంచిగా మారిపోయింది. మనందరికీ ఇది ఒక మంచి ఉదాహరణ’ అని చెప్పింది. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. లంబు కూడా నవ్వుతూ, ‘మిత్రులారా! ఇంతకుముందు నేను గట్టిగా అరిస్తేనే అందరూ నన్ను గౌరవిస్తారని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసింది. భయపెట్టి సంపాదించేది గౌరవం కాదు. ప్రేమగా మాట్లాడి సంపాదించేదే నిజమైన గౌరవం. మన మాటలే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలి’ అని చెప్పింది. అడవిలోని జంతువులన్నీ లంబు మాటలకు సంతోషించాయి. అప్పటి నుంచి గంభీరవనంలో జంతువులన్నీ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ, కలిసిమెలిసి జీవించసాగాయి. లంబు గాడిద తన తప్పును తెలుసుకుని ఎంత మంచి మార్పు తెచ్చుకుందో! మనం కూడా ఎప్పుడూ ఇతరులతో కోపంగా, అహంకారంగా, అవమానించేలా మాట్లాడకూడదు. చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. మనకు ఏదైనా కావాలంటే బలవంతంగా తీసుకోకుండా ప్రేమగా అడగాలి. ఎవరైనా మనకు సహాయం చేస్తే ధన్యవాదాలు చెప్పాలి. మన వల్ల ఎవరైనా బాధపడితే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మంచి మాటలు మనుషుల మధ్య ప్రేమను పెంచుతాయి, స్నేహాన్ని బలపరుస్తాయి.

నీతి

ఈ కథలో లంబు అనే గాడిద తనకు ఆకలిగా ఉన్నప్పుడు ఇతర జంతువులను బెదిరించి, కేకలు వేసి ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. చిలుకను అవమానిస్తుంది, ఉడత దగ్గర నుంచి బలవంతంగా జామపండు తీసుకుంటుంది, ఎలుగుబంటిని బెదిరించి తేనె తీసుకోవాలనుకుంటుంది. చివరికి ఎలుగుబంటి చేతిలో దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఏనుగును కూడా మర్యాద లేకుండా బెదిరించడంతో దాని తొండంతో నీళ్లు చల్లించుకుని బురదలో పడిపోతుంది.

కానీ చింటి కోతి మాత్రం ఏనుగును గౌరవంగా పలకరించి, వినయంగా ఒక మామిడి పండు అడుగుతుంది. ఏనుగు సంతోషంగా దానికి పండ్లు ఇస్తుంది. ఈ సంఘటన ద్వారా లంబుకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. బెదిరిస్తే భయం మాత్రమే కలుగుతుంది, కానీ ప్రేమగా, మర్యాదగా మాట్లాడితే గౌరవం, సహాయం లభిస్తాయి. తర్వాత లంబు తన తప్పును తెలుసుకుని ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుతుంది. ఈసారి వినయంగా పండు అడగడంతో ఏనుగు సంతోషంగా మామిడి పండు ఇస్తుంది. అప్పటి నుంచి లంబు అందరితో మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకుంటుంది.

ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది..

  • మర్యాదగా మాట్లాడాలి: చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరితో గౌరవంగా మాట్లాడాలి.
  • ఎవరినీ అవమానించకూడదు: ఇతరుల రూపాన్ని, స్వభావాన్ని చూసి ఎగతాళి చేయకూడదు.
  • బెదిరింపులతో పనులు సాధించలేం: బలవంతం తాత్కాలికంగా భయాన్ని కలిగించవచ్చు కానీ ప్రేమను, గౌరవాన్ని సంపాదించలేం.
  • వినయంగా అడగడం నేర్చుకోవాలి: మనకు ఏదైనా అవసరమైనప్పుడు దయచేసి అని అడగాలి. ఎదుటివారికి కృతజ్ఞతలు చెప్పాలి.
  • తప్పు తెలుసుకుని మారాలి: మనం చేసిన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడం గొప్ప లక్షణం.
  • మంచి మాటలు మంచి సంబంధాలను పెంచుతాయి: మన మాటలే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.

మనం ఎప్పుడూ కోపంగా, అహంకారంగా మాట్లాడకుండా ప్రేమగా, ఆప్యాయంగా, మర్యాదగా మాట్లాడాలి. ఎదుటివారి మనసును గాయపరచకుండా ప్రవర్తించాలి. ఎందుకంటే మంచి మాటలు మనకు మంచి స్నేహితులను సంపాదించి పెడతాయి. ఇతరుల ప్రేమను, గౌరవాన్ని పొందేలా చేస్తాయి.

Follow Us